Asianet News TeluguAsianet News Telugu

భూత వైద్యం.. దెయ్యం పట్టిందంటూ యువకుడిని చితకబాది..!

ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు వ్యవసాయ కూలి పనులకు వెళ్లేవాడు. కాగా.. ఈ నెల 1వ తేదీన మూర్ఛ వచ్చి నరేశ్ అస్వస్థతకు గురయ్యాడు.

Man Died due to Superstition in Kurnool
Author
Hyderabad, First Published Jun 7, 2021, 7:37 AM IST

ఓ వైపు దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. మరో వైపు ఇంకా మూఢ నమ్మకాలు, భూత వైద్యం అంటూ ప్రాణాలు తీసుకుంటున్నవారు కూడా ఉన్నారు. తాజాగా ఓ యువకుడికి దెయ్యం పట్టిందంటూ దారుణంగా కొట్టి చంపారు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామానికి చెందిన వెంకట రాముడు, ఈరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా.. వారి కుమారుడు నరేశ్24) డిగ్రీ చదువుతున్నాడు. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు వ్యవసాయ కూలి పనులకు వెళ్లేవాడు. కాగా.. ఈ నెల 1వ తేదీన మూర్ఛ వచ్చి నరేశ్ అస్వస్థతకు గురయ్యాడు.

దీంతో.. వెంటనే భూత వైద్యుడికి చూపించారు. నరేశ్ కు దెయ్యం పట్టిందని.. దాన్ని వదిలేస్తానంటూ  భూత వైద్యుడు ఈత బరిగెలు, కర్రలతో తీవ్రంగా కొట్టాడు. తలకు గాయమై, యువకుడి పరిస్థితి మరింత విషమించింది. విషయం తెలిసిన గ్రామస్థులు తల్లిదండ్రులను మందలించి.. ఈ నెల 4న కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

మూడు రోజులుగా మృత్యువుతో పోరాడిన నరేశ్ ఆదివారం మృతి చెందాడు. కాగా.. యువకుడి అంత్యక్రియలు కూడా స్నేహితులే స్వయంగా చేయడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios