టిడిపి నేత, మాజీ ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు కారు దంపతులు ప్రయాణిస్తున్న టూవీలర్ ను ఢీకొట్టగా భర్త మృతిచెందగా భార్య పరిస్థితి విషమంగా వుంది. ఈ దారుణం చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.  

చిత్తూరు : మాజీ ఎమ్మెల్సీ కారు ఢీకొని ఒకరు దుర్మరణం చెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఈ దుర్ఘటన చిత్తూరు జిల్లాలో పలమనేరు సమీపంలో చోటుచేసుకుంది. భార్యాభర్తలు బైక్ పై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. టిడిపి నేత గౌనివాని శ్రీనివాస్ స్వయంగా కారు నడుపుకుంటూ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 

వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని కొలార్ జిల్లా బంగారుపేట ఐతెనహళ్లి ప్రాంతానికి చెందిన లక్ష్మమ్మ(55), మునెప్ప(60) భార్యాభర్తలు. వీరిద్దరూ బైక్ ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చారు. చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లికి బయలుదేరారు. మరికొద్ది నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనగా వీరు ప్రయాణిస్తున్న బైక్ ను వేగంగా వచ్చిన మాజీ ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాస్ కారు ఢీకొట్టింది.

శనివారం రాత్రి పలమనేరు జాతీయరహదారిపై గుండిశెట్టిపల్లి సమీపంలో దంపతులు ప్రయాణిస్తున్న టూవీలర్ ను మాజీ ఎమ్మెల్సీ ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో భార్యభర్తలు తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయారు. 108 అంబులెన్స్ లో వారిని తరలిస్తుండగా మార్గమధ్యలో మునెప్ప మరణించాడు. లక్ష్మమ్మ తీవ్ర గాయాలతో ప్రాణాపాయస్థితిలో కుప్పం ప్రాంతీయ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఆమె తలకు కూడా తీవ్ర గాయమైనట్లు... మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. 

కృష్ణాజిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. తల్లి, ముగ్గురు కూతుళ్లపై కత్తితో దాడి..(వీడియో)

ప్రమాద సమయంలో స్వయంగా మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ కారు నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు నుండి ఎమ్మెల్సీని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ రోడ్డు ప్రమాదం కర్ణాటక ఐతెనహల్లి గ్రామంలో విషాదాన్ని నింపింది. మునెప్ప మృతి, లక్ష్మమ్మ గాయాలతో హాస్పిటల్ పాలయిన విషయం తెలిసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత మునెప్ప మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించనున్నారు. 

ఇదిలావుంటే ఇటీవల తిరుపతి జిల్లాలోని పి. మల్లవరం సమీపంలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయడ్డారు. మృతుల్లో చిన్నారి, మహిళ వున్నారు. 

తమిళనాడుకు చెందిన ఓ కుటుంబం కారులో తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు తిరిగి వెళ్లున్న సమయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. మల్లవరం వద్ద కారు వేగంగా వెళుతూ అదుపుతప్పి రోడ్డుమధ్యలో వుండే డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. తమిళనాడుకు చెందిన శరణ్య, మిథున్ లు మరణించినట్టుగా పోలీసులు గుర్తించారు. గాయడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

ఇక హైద్రాబాద్ పెద్దగోల్కోండ సమీపంలోనూ ఇలాగే రోడ్డు ప్రమాదంలో ఇతరరాష్ట్ర వాసులు మృతిచెందరు. వేగంగా వెళుతున్న కారు ఆగి ఉన్న లారీని ఢికొట్టింది.ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. వీరంతా మహారాష్ట్రకు చెందినవారు. తిరుపతిలో శ్రీవారిని దర్శించుకొని మహారాష్ట్రకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ఆగి ఉన్న ట్రక్కు వెనుక భాగంలోనికి కారు ముందు భాగం వెళ్లింది. దీంతో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.