విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలం పరశురాంపురం గ్రామంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పంట పొలాల్లోకి  వచ్చిన ఏనుగులు పంటను నాశనం చేశాయి. ఏనుగులు ఒకేసారి గుంపులు గుంపులు గా వచ్చి దాడులు చేస్తుండటంతో.. గ్రామానికి చెందిన స్థానికులు భయంతో పరుగులు తీశారు.

కాగా.. ఈ క్రమంలో ఏనుగులు ఓ వ్యక్తిపై దాడి చేశాయి. దీంతో.. రఘు మండల లక్ష్మీ నాయుడు(50) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా..  ఏనుగులు బీభత్సానికి ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడ ఏనుగుల దాడికి కొంతమంది మృతి చెందగా, మరి కొంతమంది తీవ్ర గాయాలు పాలయ్యారు.

 శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఏనుగులను దూరంగా తరిమేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.