భార్యతో గొడవ .. మద్యం మత్తులో నాటు బాంబు కొరికిన మందుబాబు
చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం గడ్డంవారిపల్లెకు చెందిన చిరంజీవి అనే వ్యక్తి భార్యతో గొడవపడి మద్యం మత్తులో నాటు బాంబును నోటితో కొరికి దుర్మరణం పాలయ్యాడు

మద్యం మత్తులో కొందరు ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియదు.. ఒళ్లు తెలియకుండా పీకలదాకా తాగి.. వేరే లోకంలో విహరిస్తూ వుంటారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో బాంబు కొరికి ప్రాణాలు పొగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం గడ్డంవారిపల్లెకు చెందిన చిరంజీవి అనే వ్యక్తికి భార్యతో గొడవలు వున్నాయి.
ఈ క్రమంలో ఆమె అతనితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పీకలదాకా మద్యం తాగి నాటు బాంబును నోటితో కొరికాడు. అది పేలడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.