తేనేటీగల దాడిలో భర్త మృతిచెందగా ప్రాణాపాయ స్థితిలో భార్య చికిత్స పొందుతున్న ఘటన అనకాాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
అనకాపల్లి : గొర్రెలు మేపడానికి అడవికి వెళ్లిన దంపతులపై తేనెటీగలు దాడిచేసిన ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దాడిలో భర్త మృతిచెందగా భార్య ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ పాలయ్యింది.
వివరాల్లోకి వెళితే... అనకాపల్లి జిల్లా రావికమతం మండలం గర్నికం గ్రామానికి చెందిన కామానాయుడు(61) - నూకాలమ్మ(57) దంపతులు శుక్రవారం గొర్రెలు కాసేందుకు పొలానికి వెళ్లారు. వీరు ఓ చెట్టు వద్ద గొర్రెలను కాస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేసాయి. పశువులు రంకెలేస్తూ ఒకదాన్ని ఒకటి పొడుచుకుంటూ చెట్టును ఢీకొనగా తేనెపట్టు కదిలింది. దీంతో తేనెటీగలు లేచి పశువులపైనే కాకుండా దగ్గర్లోనే గొర్రెలు కాస్తున్న కామానాయుడు-నూకాలమ్మ దంపతులపైనా దాడిచేసారు.
తేనెటీగల గుంపు దాడినుండి దంపతులను కాపాడిన చుట్టుపక్కల పొలాలవారు అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా వుండటంతో విశాఖ కేజీహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భర్త కామానాయుడు ప్రాణాలు కోల్పోయాడు. నూకాలమ్మ పరిస్థితి కూడా విషమంగా వుంది.
