ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కర్కషంగా కడతేర్చిందో ఇల్లాలు.. ఈ ధారుణ ఘటన కొత్తూరు లో జరిగింది. సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ వైరును మెడకు చుట్టి దారుణంగా హతమార్చింది ఆ భార్య. ఆ తరువాత ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూసింది. అయితే  పోస్టుమార్టం నివేదికలో హత్యగా తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

కొత్తూరు కాలేజీ రోడ్డుకు ఆనుకొని నివాసం ఉంటున్న దూలి రాము(35) ఈ నెల 26వ తేదీన చనిపోయాడు. అయితే తొలుత అత్మహత్యగా భావించారు. తల్లి లక్ష్మి మాత్రం రామును హత్య చేశారని ఆరోపిస్తూ అదేరోజున పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాము మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

పోస్టుమార్టం నివేదికలో హత్యగా వైద్యులు నిర్ధారించినట్టు ఎస్సై వివరించారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. రాము భార్య కుమారి ఇదే గ్రామానికి చెందిన సొండి సతీష్‌తో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్టు గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని  విచారించగా నేరం అంగీకరించినట్టు ఎస్సై చెప్పారు. 

తమ ఆనందానికి రాము అడ్డుగా ఉండేవాడని, దీంతో ప్రాణం తీసి అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పినట్టు వివరించారు. సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ వైరును రాము మెడకు గట్టిగా బిగించి ప్రాణం తీశారన్నారు. 
గ్రామస్తులు, కుటుంబ సభ్యులను నమ్మించేందుకు ఉరివేసుకున్నట్లు పీకకు చున్నీ చుట్టి ఫ్యాన్‌కు వేలాడిదీసినట్టు కుమారి, సతీష్‌లు అంగీకరించారు. దీంతో ఇద్దరినీ అరెస్టు చేసి శ్రీకాకుళం జ్యుడిషియల్‌ మెజిస్టేట్‌ కోర్డులో హజరు పరిచినట్లు చెప్పారు. కాగా తండ్రి చనిపోవడం, తల్లి  జైలుకి వెళ్లడంతో ఇద్దరు చిన్నారులు ఒంటరయ్యారు.