ప్రాణం చూసుకునే భార్య అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడాన్ని భర్త తట్టుకోలేకపోయాడు. తన భార్య లేకుండా తాను బతకలేను అనుకున్నాడు. అంతే... ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే... తాము ఇద్దరం లేకుండా.. తమ చిన్నారి దిగ్గులేనిది అవుతుందేమోనని భయంతో... కూతురిని చంపేసి...ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  మండపేటలోని నాళం వారి వీధికి చెందిన బాదం చందన్ కుమార్(35) కి భార్య శ్రీనవ్య(28), కూతురు యోషిత(4) ఉన్నారు. కాగా... బాదం చందన్ కుమార్ ఫ్లెక్సీ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతని భార్య శ్రీనవ్య... డెంగీ జ్వరంతో మృతి చెందింది. గత నెల 11వ తేదీన ఆమె కన్నుమూసిన నాటి నుంచి చందన్... మనస్థాపానికి గురయ్యాడు.

ప్రేమించి పెళ్లాడిన భార్య దూరం కావడంతో తట్టుకోలేకపోయాడు. అప్పటి నుంచి తీవ్ర మనోవేదన గురైన చందు కుమార్తెతో కలిసి ఒంటరిగానే ఉంటున్నాడు. యోషిత రోజూ తల్లి కోసం ఏడుస్తూ ఉండేది. ఆ చిన్నారి పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయేవాడు. చివరకు గురువారం ఉదయం కుమార్తెతో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

కాగా.. చందు చెల్లెలు ఫోన్‌ చేయగా..ఎంతకూ తీయకపోవడంతో పక్కింటి వారికి సమాచారం ఇవ్వడంతో ఈ ఘోరం వెలుగుచూసింది. మరణానికి ముందు అత్తమామలు, బావ, చెల్లెలు, మిత్రులకు చందు నాలుగు పేజీల లేఖ రాశాడు. తన వద్ద ఉన్న డబ్బు, బంగారాన్ని తండ్రి, చెల్లి, అత్తమామలు తీసుకోవాలని సూచించాడు. 

తన భార్యలేకుండా ఉండలేకపోతున్నానని, అందుకే ఈ లోకం విడిచి ఆమె వద్దకే వెళ్లిపోతున్నానని పేర్కొన్నాడు. తన కూతురు ఎవరికీ భారం కాకూడదనే కూడా తీసుకెళ్తున్నాని రాశాడు. ‘నేను ప్రాణంగా చూసుకునే భార్య చనిపోయిన తర్వాత నన్ను మరో పెళ్లిచేసుకోమని అంటున్నారు. మళ్లీ పెళ్లి చేసుకుంటే నాకు భార్య వస్తుంది కానీ.. నా కూతురికి తల్లిరాదు. నాకు మళ్లీ పిల్లలు పుడితే నా కూతురు మరో శ్రీనవ్యలా మరొకరికి భారంగా పెరగాల్సి వస్తుంది. అది నాకిష్టం లేదు. నా కుటుంబానికి ఏదో శాపం ఉంది. నా మరణంతోనైనా అది పోవాలి. నా భార్య వద్దకే వెళ్లిపోతున్నా.. క్షమించండి’ అని సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు.