వివాహేతర సంబంధానికి తోడు అనుమానం భూతం కారణంగా రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. వివరాల్లోకి వెళితే.. చిత్తూరుకు చెందిన దొరస్వామి కుమార్తెతో ఆర్మీ ఉద్యోగికి వివాహమై, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

భర్త విధుల నిమిత్తం ఇతర రాష్ట్రంలో ఉండటంతో గీతారాణి అదే ప్రాంతానికి చెందిన హమీద్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ సంగతి తెలుసుకున్న ఆమె భర్త... గీతారాణిని విడిచిపెట్టగా, హమీద్ భార్య కూడా తన కుమారుడిని విడిచిపెట్టి వెళ్లిపోయింది.

అప్పటి నుంచి ఆరేళ్లుగా గీత, హమీద్ కలిసే వుంటున్నారు. కొద్దికాలంగా గీత ప్రవర్తనపై అతనికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో గురువారం ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో హమీద్.. కత్తితో ఛాతి, తల, నడుము భాగాల్లో పొడిచి పారిపోయాడు.

తీవ్రగాయాలతో ఉన్న గీతారాణి అరుపులు, కేకలతో వీధిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. దీంతో స్థానికులు ఆమెను ఆటోలో ఎక్కించుకుని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గీతారాణిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఆ కొంతసేపటికే దుర్గానగర్ కాలనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో విషం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన హమీద్‌ను స్థానికులు గుర్తించి.. అతనిని కూడా చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా..మార్గమధ్యంలోనే మరణించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికులను విచారించారు. వీరిద్దరి మరణంతో ఇరు కుటుంబాలకు చెందిన ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. గీత భర్తకు దూరంగా ఉన్నప్పటికీ.. ఇద్దరు కూతుళ్లను చదివిస్తోంది. హమీద్ సైతం భార్య నుంచి విడిపోయినా ఆటో నడుపుకుంటూ కుమారున్ని పోషిస్తున్నాడు.