చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి అత్యంత దారుణమైన పనికి ఒడిగట్టాడు. భార్యపై అతను అనుమానం పెంచుకున్నాడు. ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. శనివారంనాడు ఆమె మర్మాంగాలను కోసేశాడు. 

ఆ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం పెంచుపాడు పంచాయతీ పాశంవారిపల్లెలో జరిగింది. పాశంవారిపల్లెకు చెందిన కృష్ణమూర్తి నాటకాలు వేస్తుండేవాడు. కొద్ది రోజులుగా భార్య రాధ (25)ను తరుచుగా కొడుతూ వస్తున్నాడు. ఆమెపై అనుమానంతో ఆ రకంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. 

నాలుగు రోజుల క్రితం గ్రామ సమీపంలోని అడవిలోకి తీసుకుని వెళ్లి కాళ్లూ చేతులూ కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. కత్తితో ఆమె మర్మాంగాలు కోసేశాడు. బాధితురాలి తల్లిగారింటికి చెందినవారు ఆ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో సంఘటన శనివారంనాడు వెలుగులోకి వచ్చింది.