విజయవాడ సత్యనారాయణ పురంలో భర్త చేతిలో దారుణ హత్యకు గురైన వివాహిత మణిక్రాంతి తల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. హత్య తర్వాత భార్య తలను ఆమె భర్త ప్రదీప్ కాలువలో పడేసినట్లు చెప్పాడు.

దీంతో ఆమె తల కోసం ఏలూరు కాలువలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా బుడమేరు కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గాలింపుకు ఆటంకం ఏర్పడింది.

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళానికి చెందిన ప్రదీప్ కుమార్, విజయవాడకు చెందిన మణిక్రాంతి పటమటలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తుండగా ప్రేమలో పడ్డారు. ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోయినప్పటికీ 2015లో కులాంతర వివాహం చేసుకున్నారు.

రెండేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో తర్వాత కలతలు మొదలయ్యాయి. దీంతో ఏడాదిన్నరగా భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు. మణిక్రాంతి సత్యనారాయణ పురం శ్రీనగర్ కాలనీలోని 4వ లైనులో తల్లి వద్ద వుంటోంది.

తనను తీవ్రంగా వేధిస్తున్నాడంటూ ప్రదీప్‌పై మణిక్రాంతి సత్యనారాయణపురం, సూర్యారావు పేట, మాచవరం, అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లలో కేసు పెట్టింది. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.

బెయిల్‌పై బయటకొచ్చిన ప్రదీప్ ఆదివారం మధ్యాహ్నం భార్యను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కుట్రలో భాగంగా అత్తగారి ఇంటి వద్ద కాపు కాశాడు. ఇంటికి వచ్చిన భార్యపై కొడవలితో దాడి చేశాడు.

ఆమె ఎంతగా వేడుకున్నప్పటికీ వినిపించుకోలేదు.. వెంటాడి మరీ మణిక్రాంతి తలను నరికి పక్కనే వున్న ఏలూరు కాలువలో పడేసి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. 

దారుణం: భార్య తలను తీసుకెళ్తుండగా...