ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతను చెప్పిన మాటలను ఆ మైనర్ బాలిక నిజమని నమ్మేసింది. అతని మాయలో పడిపోయింది. తన సర్వస్వం అర్పించుకుంది. అతని కారణంగా బాలిక గర్భం కూడా దాల్చింది. తీరా.. బాలిక తల్లి అయ్యాక.. ఆమెను మోసం చేసి మరో యువతి మెడలో తాళికట్టాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రేమపేరుతో వంచించి తల్లిని చేసి ఇప్పుడు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలని బాధిత మైనర్‌ అంగన్‌వాడీ కేంద్రం వద్ద స్థానిక మహిళలతో కలిసి ఆదివారం ఆందోళనకు దిగింది. కృత్తివెన్ను మండలం గరిశపూడి పంచాయతీ దోమలగొందికి చెందిన బాధిత మైనర్‌ (17) మాట్లాడుతూ అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రసాద్‌ ప్రేమ పేరుతో వంచించి తల్లిని చేశాడని చెప్పింది. 

దీనిపై 2019 డిసెంబర్‌లో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారని చెప్పింది. అతను బయటకు వచ్చిన తరువాత మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరింది.