ఆమెకు చెన్నైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం... చేతినిండా జీతం.. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. అందుకోసం మ్యాట్రిమోనీలో తన వివరాలు పొందుపరిచింది. అందులో ఓ యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. అభిరుచులు కలవడంతో... అతనిని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. అయితే... పెళ్లి పేరుతో ఆమెను ఆ వ్యక్తి మోసం చేశాడు. మాయ మాటలు చెప్పి... ఆమె వద్ద నుంచి రూ.లక్షల్లో డబ్బులు గుంజేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన చిత్తూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చిత్తూరు నగరానికి చెందిన ఓ యువతి చెన్నైలోని ఓ సాప్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తోంది.తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలనుకుంటుండగా చెన్నైలోని భారత్‌ మ్యాట్రిమోనీ(తమిళ్‌ మ్యాట్రిమోనీ)లో సభ్యురాలిగా చేరింది. అక్కడ తప్పుడు వివరాలతో నమోదైన ఓ వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. కొన్ని రోజులు వాళ్లిద్దరూ చాటింగ్‌ ద్వారా ఊసులాడుకున్నారు. ఆమె అతడిని ఇష్టపడింది. 

తనను చూడటానికి యూకే నుంచి వస్తున్నట్లు అతను చెప్పాడు. ఎదురుచూస్తుండగా ఢిల్లీలో పోలీసులు పట్టుకున్నారని.. బెయిల్‌, ఇతర అవసరాల కోసం డబ్బులు కావాలని అడిగాడు. తన కోసం వస్తుండగా ఇలా జరిగిందనుకున్న ఆమె చెన్నై నుంచి విడతలవారీగా వివిధ ఖాతాల ద్వారా రూ.2.44 లక్షలను అతని ఖాతాకు జమ చేసింది. అయితే మళ్లీ మళ్లీ డబ్బులడుగుతుండడంతో ఆమెకు అనుమానం వచ్చింది. 

భారత్‌ మ్యాట్రీమోనీలో సెర్చ్‌ చేయగా అప్పటికే అతని ఖాతా లేకపోవడంతో మోసపోయిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. శుక్రవారం చిత్తూరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.