కన్నీళ్లను దిగమింగుకుని కన్నకొడుకు మృతదేహాన్ని తండ్రే భుజాన వేసుకుని బైక్ పై హాస్పిటల్ నుండి ఇంటికి తరలించిన అమానవీయ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనపై స్పందిస్తూ టిడిపి నేత నారా లోకేష్ సీఎం జగన్ కు చురకలు అంటించారు.
మంగళగిరి: తిరుపతి రుయా హాస్పిటల్ వద్ద అంబులెన్స్ సిబ్బంది అమానుషంగా వ్యవహరించడంతో ఓ తండ్రి కొడుకు మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లిన ఘటన మరుకముందే నెల్లూరు జిల్లాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇలా రాష్ట్రంలో గతకొద్ది రోజులుగా వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్న ఘటనలు అనేకం వెలుగుచూసాయి. ఇలా ఏపీలో వరుసగా చోటుచేసుకుంటున్న అమానవీయ ఘటనలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.
''రుయాలో అంబులెన్స్ మాఫియా అరాచకం చూసాం. విశాఖ కేజీహెచ్ ప్రసూతి విభాగంలో ఒక కుటుంబం పై తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల మాఫియా దాడి చూసి షాక్ అయ్యాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కోసం రూ.15 వేలు డిమాండ్ చేశారు సిబ్బంది. రోజుకో అమానుష ఘటన జరుగుతున్నా వైసిపి ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదు'' అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
''నెల్లూరు జిల్లా సంఘంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బిడ్డని కోల్పోయిన బాధలో ఉన్న తండ్రి అంబులెన్స్ ఏర్పాటు చెయ్యాలని వేడుకున్నా ఆస్పత్రి సిబ్బంది మానవత్వంతో స్పందించకపోవడం దారుణం. ఎవరూ సహాయం చెయ్యని దయనీయ పరిస్థితిలో బైక్ పైనే కొడుకు శ్రీరామ్ మృత దేహాన్ని తరలించాడు ఆ తండ్రి'' అంటూ లోకేష్ ఆవేదన వ్యక్తం చేసారు.
''పబ్లిసిటీ పిచ్చితో మీరు జెండా ఊపిన వాహనాలు అన్నీ ఎక్కడికి పోయాయి జగన్ రెడ్డి గారు? సిబ్బంది, కనీస సౌకర్యాల లేమితో ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అంబులెన్స్ నిర్వహణ మీ ఏ2 సాయిరెడ్డి అల్లుడికి కట్టబెట్టాకే ఈ దారుణాలు జరుగుతున్నాయి. ఈ అమానవీయ ఘటనలపై ఒక్కసారైనా సమీక్ష చేశారా?'' అని సీఎం జగన్ ని నిలదీసారు నారా లోకేష్.
అసలేం జరిగిందంటే...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంకు చెందిన శ్రీరామ్ (8), ఈశ్వర్ (10) అనే ఇద్దరు చిన్నారులు నిన్న (బుధవారం) కనిగిరి జలాశయం ప్రధాన కాలువవద్దకు బహిర్భూమికి వెళ్ళారు. అయితే ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు కాలువలో పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, చిన్నారుల తల్లిదండ్రులు కాలువవద్దకు చేరుకుని మృతదేహాలను బయటకు తీసారు.
అయితే ఈశ్వర్ మృతదేహాన్ని తల్లిదండ్రులు నేరుగా ఇంటికి తీసుకెళ్లగా శ్రీరామ్ ఇంకా బ్రతికున్నాడన్న ఆశతో తల్లిదండ్రులు దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ బాలున్ని పరిశీలించిన వైద్యులు చనిపోయినట్లు నిర్దారించారు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
అయితే ప్రైవేట్ వాహనంలో మృతదేహాన్ని తరలించే స్థోమత లేక 108 అంబులెన్స్ లో తరలించాలని బాలుడి తండ్రి భావించాడు. ఇందుకోసం అంబులెన్స్ సిబ్బందిని వేడుకోగా నిబంధనలు అంగీకరించవు అంటూ వారు నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక ఆ తండ్రి కొడుకు మృతదేహాన్ని భుజాన వేసుకుని బైక్ ఎక్కాడు. ఓ వ్యక్తి బైక్ డ్రైవ్ చేయగా వెనకాల కొడుకు మృతదేహంతో తండ్రి కూర్చుని ఇంటికి తరలించారు. ఈ దృశ్యం చూసినవారికే కంటివెంట నీరు వచ్చిందంటే ఆ తండ్రి వేదన ఎలా వుందో అర్థంచేసుకోవచ్చు.
