కరివేపాకు కోసిస్తానని చెప్పి పదకొండేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన ప్రకాశం జిల్లా వెలిగండ్లలో జరిగింది. అభం శుభం తెలియని పసిదానిపై పాశవికంగా దాడిచేసిన ఆ మానవమృగాన్ని రక్షించాలని గ్రామపెద్దలు ప్రయత్నించారు.  అయితే పోలీసులకు విషయం తెలియడంతో నిందితుడు కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెడితే..

కంకణపాడుకి చెందిన రాయళ్ల మాలకొండయ్య అనే ప్రబుద్ధుడు బాలిక ఇంట్లో తల్లిలేదని గమనించాడు. ఇంటి దగ్గరికి వెళ్లి మీ అమ్మ కరివేపాకు అడిగింది. పొలానికి వస్తే కోసిస్తానంటూ తన వెంట రమ్మన్నాడు. అతని మాటలు నమ్మిన బాలిక అతనితో బండిమీద ఎక్కి పొలం దగ్గరికి వెళ్లింది.

అక్కడ ఎవరూ లేని ప్రాంతం చూసి మాలకొండయ్య బాలికపై అత్యాచారం చేశాడు. విషయం బైటికి పొక్కడంతో గ్రామస్థులు, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ చేశారు. బాలిక తల్లికి కొంత పరిహారం ఇచ్చేలా పెద్ద మనుషులు రాజీ కుదిర్చారు. అయితే విషయం కనిగిరి పోలీసులకు తెలిసింది.

సీఐ కె. వెంకటేశ్వరరావు, ఎస్సై రాజ్ కుమార్ గ్రామానికి వచ్చి విచారించారు. రాజీ ప్రయత్నాలు చేసిన పెద్దమనుషులను మందలించి, వారి సహకారంతో నిందితుడి ఆచూకీ తెలుసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.