కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. అతనికి ఇద్దరు భార్యలు. వారిపై అతను హత్యాప్రయత్నం చేశాడు. వారికి వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం ఉందని అనుమానించి అతను వారిని చిత్రహింసలకు గురి చేశాడు. 

తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని చట్టి గ్రామంలో ఆ సంఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెదిన కల్యాణం వెంకన్నకు ఇద్దరు భార్యలు. నాలుగు రోజుల క్రింద అతను పెద్ద భార్య ముక్కూచెవులలను కత్తితో కోశాడు. దీంతో ఆమె భయపడి తెలంగాణలోని వరంగల్ సమీపంలో గల పుట్టింటికి వెళ్లిపోయింది. 

అదే రోజు వెంకన్న తన చిన్న భార్యకు మాటమాటలు చెప్పి ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. గాయాలతో ఆమె తప్పించుకుని భద్రాచలంలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది.

మర్నాడు వెంకన్న భద్రాచలం వెళ్లి గొడవకు దిగాడు. దీంతో బాధితురాలు చింతూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.