భర్త మద్యం తాగి వస్తే భార్య గొడవ పడడం కామన్.. కానీ భార్య మద్యం సేవించిందని భర్త గొడవకు దిగిన ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో భార్య చనిపోవడంతో విషాదాంతం అయ్యింది. 

క్షణికావేశంలో భర్త చేసిన పని ఆ భార్య ప్రాణాలు తీసింది. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం మాతుమూరు దగ్గర్లో శనివారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా అరకు మండలం పూజారిపుట్టు గ్రామానికి చెందిన మర్రి శోభన్ (30), భార్య మర్రి తులసి (24). వీరిద్దరు గత యేడాదిగా మాతుమూరులోని ఓ రైతుకు చెందిన పామాయిల్ తోటలో పనిచేస్తున్నారు. 

ఈ క్రమంలో తులసి తన తల్లితో కలిసి శనివారం ఉదయం సాలూరు కు వెళ్లింది.  అక్కడ మద్యం సేవించి సాయంత్రం ఇంటికి వచ్చింది. ఇది తెలిసిన భర్త శోభన్, తులసిని మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా, మాటా పెరిగింది. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన శోభన్, తాము ఉంటున్న ప్రదేశానికి కొంత దూరం భార్యను తీసుకెళ్లి ఆమె మొహం మీద కర్రతో కొట్టాడు. 

దీంతో తీవ్ర గాయాలైన తులసి అక్కడిక్కడే చనిపోయింది. విషయం తెలుసుకున్న సాలూరు సీఐ ఎల్. అప్పలనాయుడు సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు హెచ్ సీ ప్రసాద్ తెలిపారు.