సత్తెనపల్లి: మరో మహిళతో వివాహేతర సంబంధం వద్దని చెప్పిన భార్యను భర్త అత్యంత దారుణంగా హత్య చేశాడు. భార్య తలను మొండెం నుండి వేరు చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు  నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చోటు చేసుకొంది.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన ముప్పన శ్రీనివాసరావుకు తండ్రి మరణంతో  లింగంగుంట్ల మేజర్‌పై ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత 20 ఏళ్ల క్రితం ఆయన మాండ్ల అంకమ్మను పెళ్లి చేసుకొన్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. 

ఐదేళ్ల క్రితం ఫిరంగిపురం మండలానికి శ్రీనివాసరావుకు బదిలీ అయింది. కొండవీడు మేజర్‌పై లస్కర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.భార్య, పిల్లలను సత్తెనపల్లిలోని ఎన్‌ఎస్‌పీ కాలనీలో ఉంచి రాకపోకలు సాగించేవాడు.

శ్రీనివాసరావుకు ఫిరంగిపురంలో మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో అక్కడే ఉండేవాడు. ఎప్పుడో ఒక్కసారి భార్య వద్దకు వచ్చేవాడు. భార్య వద్దకు వచ్చిన సమయంలో మద్యం తాగొచ్చి గొడవకు దిగేవాడు.అంతేకాదు జీతం కూడ ఇవ్వడం మానేశాడు. 

ఈ విషయమై భార్య అంకమ్మకు అనుమానం వచ్చింది. ఫిరంగిపురం వెళ్లిన అంకమ్మకు మరో మహిళతో శ్రీనివాసరావు ఉండడాన్ని చూసింది. అక్కడే భర్తతో గొడవ పడింది. అక్కడి నుండి భర్తను తీసుకొని సత్తెనపల్లికి వచ్చింది. 

అయినా కూడ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నెల 20వ తేదీన రాత్రి శ్రీనివాసరావు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవపడ్డాడు. ఈ విషయమై ఆమె తన సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది. అర్ధరాత్రి వరకు గొడవ జరిగింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె భర్తను హెచ్చరించింది.అంతేకాదు ఆమె ఇంటి నుండి బయటకు వచ్చింది. 

భార్య వెనుకే శ్రీనివాసరావు వచ్చాడు. ఎన్ఎస్‌పీ బంగ్లా వద్ద భార్యను కత్తితో నరికాడు. మొండెం నుండి తలను వేరు చేశాడు. తలను తీసుకొని పారిపోయే ప్రయత్నం చేస్తుండగా ఈ సమాచారం తెలుసుకొన్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి సోదరుడు మాండ్ల అంకారావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.