ప్రేమించానని వెంటపడ్డాడు... శారీరకంగా వాడుకుని గర్భవతిని చేసాడు... తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లాడాడు... ఇలా ఐదేళ్లు కాపునం చేసి మళ్లీ గర్భవతిగా వుండగా కట్టుకున్న భార్యను అతికిరాతకంగా హతమార్చాడో కసాయి. 

కంచికచర్ల: ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతూ మాయమాటలతో నమ్మించి పలుమార్లు శారీరకంగా దగ్గరై కోరిక తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆమెను వదిలేద్దామని అనుకున్నా అప్పటికే ఆమె గర్భం దాల్చడంతో పెళ్లాడక తప్పలేదు. పెళ్లి తర్వాత కూడా ఆమెను నిత్యం వేదిస్తూ భార్యను, ఆమె కడుపులోకి బిడ్డను హతమార్చాడు. ఇలా భర్తే నిండు గర్భిణిని అతి కిరాతకంగా హతమార్చిన దారుణం ఎన్టీఆర్ జిల్లాలో వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళితే... నందిగామ మండలం గొళ్లమూడి గ్రామానికి చెందిన పేరం గోపి అదే గ్రామానికి చెందిన భూలక్ష్మి(22) ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించి ఆమెను నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. ఇలా పలుమార్లు భూలక్ష్మిపై అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. దీంతో భూలక్ష్మిని పెళ్లాడటం ఇష్టంలేకపోయినా పెద్దల ఒత్తిడితో వివాహం చేసుకున్నాడు.

ఇష్టంలేకుండా వివాహం చేసుకున్న భార్యపై, పుట్టిన బిడ్డను రోజురోజుకూ కోపాన్ని పెంచుకున్నాడు గోపి. ఇలా ఐదేళ్లపాటు అయిష్టంగానే కాపురం చేసాడు. భార్యను నిత్యం అనుమానిస్తూ వేధించే భర్త చివరకు ఆమెను హతమార్చడానికి సిద్దమయ్యారు. ఇందుకు అదునుకోసం ఎదురుచూసాడు. ఇదే సమయంలో భూలక్ష్మి మరోసారి గర్భం దాల్చింది.

వైద్యపరీక్షల కోసమని ఈ నెల 8న భార్యను ద్విచక్రవాహనంపై విజయవాడకు తీసుకెళ్ళాడు గోపి. తిరిగి ఇంటికి బయలుదేరి మార్గమధ్యలో ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరులోని బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. సాయంత్రం వరకు అక్కడే వున్న గోపి-భూలక్ష్మి దంపతులు చీకటిపడ్డాక బైక్ పైనే గొళ్లమూడికి బయలుదేరారు.

అయితే భార్యపై కోపంతో రగిలిపోతున్న గోపి ఆమెను చంపడానికి ఇదే సరైన సమయంగా భావించాడు. మార్గమధ్యలో నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ని నిలిపి గర్భిణిగా వున్న భార్య మెడకు ఆమె చీరనే బిగించి చంపాలని చూసాడు. ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఆమెను వదిలిపెట్టి కొత్త నాటకానికి తెరతీసాడు. తన భార్యకు సడన్ గా శ్వాస సమస్య ఏర్పడిందని... ఊపిరాడక బాధపడుతోందంటూ 108 కు సమాచారమిచ్చాడు. ఆమెను మొదట నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడినుండి విజయవాడకు తరలిస్తుండగా ప్రాణాలు వదిలింది.

గోపి ఆడిన నాటకంతో భూలక్మిది సాధారణ మరణంగా అందరూ నమ్మారు. అయితే అంత్యక్రియల కోసం వచ్చినవారు భూలక్ష్మి మెడపై గాయాలుండటం గమనించారు. దీంతో అనుమానించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో గోపి తానే ఈ హత్య చేసినట్లు ఒప్పుకుని పోలీసుల ముందు లొంగిపోయాడు. అతడితో పాటు తల్లి రాహేలమ్మపై కూడా పోలీసులు కేసు నమోదు చేసారు.