చేబ్రోలు ఎస్సై విచక్షణారహితంగా దాడిచేయడంతో ఓ వ్యక్తి హాస్పిటల్ పాలయిన ఘటన చేబ్రోలు మండలపరిధిలో చోటుచేసుకుంది.  

గుంటూరు: భార్యాభర్తలు చిన్నచిన్న గొడవలతో పోలీస్ స్టేషన్ కు చేరితే వారికి సర్దిచెప్పి సంసారాన్ని నిలబెట్టే పోలీసులు చూస్తుంటాం. అలాగే అతి చేసి ఆ దంపతుల మధ్య మరింత దూరం పెంచే పోలీసులను చూస్తుంటాం. గుంటూరు జిల్లా చేబ్రోలు ఎస్సై రాజ్ కుమార్ రెండోకోవకు చెందినవాడని ఓ బాధితుడి ఆవేదనను బట్టి అర్ధమవుతుంది. 

బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. guntur district chebrol mandal సేకూరుకు చెందిన దిలీప్ చక్రవర్తికి భార్యతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల భార్యభర్తల మధ్య మనస్పర్దలు మరీ ఎక్కువై ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునే స్థాయికి చేరింది.

వీడియో

అయితే విచారణ పేరిట తనను స్థానిక ఎస్సై రాజ్ కుమార్ పోలీస్టేషన్ కు పిలిస్తే వెళ్లానని దిలీప్ తెలిపాడు. అయితే తనను సాయంత్రం వరకు స్టేషన్లోనే నిర్బంధించిన ఎస్సై విచక్షణారహితంగా కొట్టాడని వాపోయాడు. తీవ్రంగా కొట్టడంతో ఒళ్లంతా గాయాలవడమే కాదు చేయి కూడా విరిగిపోయిందని బాధితుడు ఆవేదనను వ్యక్తం చేసాడు. తీవ్ర గాయాలతో ప్రస్తుతం దిలీప్ తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

read more హత్య చేశారు.. మృతదేహాన్ని ట్రాక్టర్ తో తొక్కించి ఏమార్చే ప్రయత్నం....

ఇదిలావుంటే అనంతపురం జిల్లాలో కూడా ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల విద్యార్థులపై పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని ప్రతిపక్ష టిడిపి ఆరోపిస్తోంది. ఎయిడెడ్ విద్యాసంస్థలకు స్వాధీనం చేసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎస్‍ఎస్‍బీఎన్ కాలేజి విద్యార్థులు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులకు లాఠీ చేసారని ప్రతిపక్షాలు తెలిపాయి. 

 ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని లోకేష్ మండిపడ్డారు.

''గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? విద్యార్థి ఉద్యమాలు అణిచి వెయ్యాలని చూసిన ఎంతటి నియంత అయినా నేలకొరగడం ఖాయం. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలు వెంటనే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ఇచ్చిన జిఓలు రద్దు చెయ్యాలి'' అని nara lokesh డిమాండ్ చేసారు. 

అయితే ఈ ఘటనపై పోలీసుల వాదన మరోలా వుంది. అనంతపురం SSBN కళాశాల వద్ద పోలీసులు లాఠీ చార్జి చేయలేదని అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయం ప్రకటించింది.

విద్యార్థులను కళాశాలలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న విద్యార్థిసంఘాల నాయకులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారని... దీంతో కొందరు విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వినట్లు పేర్కొన్నారు. దీంతో గాయపడిన ఓ విద్యార్థినిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించామని... స్వల్ప గాయాలైన సదరు విద్యార్థికి ప్రమాదమేమి లేదని డాక్టర్ల వెల్లడించారన్నారు. జిల్లా సర్వజన ఆసుపత్రి ముందు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గించడానికి యత్నించిన విద్యార్థులను మాత్రమే చెదరగొట్టినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది.