నేడు సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నీ మూతపడనున్నాయి. ఆయా ఆలయాల్లో నేడు జరిగే కార్యక్రమాలు, పూజలు అన్నీ రద్దు చేయబడ్డాయి.
హైదరాబాద్ : సూర్య గ్రహణం కారణంగా నేడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలను మూసివేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు మూసివేస్తారు. ఈ సందర్భంగా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది. ఆలయ సంప్రోక్షణ తర్వాత భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని ఉదయం 11 గంటలకు మూసివేస్తారు. కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం కారణంగా అమ్మవారి ప్రధానాలయంతోపాటు ఉపాలయాల తలుపులు మూసివేయనున్నారు.
మంగళవారం ఉదయం 11 గంటలకు అమ్మవారికి స్నపనాభిషేకాలు, మహానివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన తరువాత అర్చకులు ఆలయ ద్వారాలను మూసివేస్తారు. తిరిగి బుధవారం ఉదయం 6 గంటలకు దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అర్చన, మహానివేదన, హారతి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. విశాఖ జిల్లాలోని సింహాచలం, శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి ఆలయాలను మూసివేస్తారు. టీటీడీ అనుబంధ ఆలయాలతో పాటు చాలా చోట్ల ఇతర ఆలయాలు కూడా మూసివేయనున్నారు.
విజయనగరంలో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం: పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
తెలంగాణలోని యాదాద్రి ఆలయాన్ని మంగళవారం ఉదయం 8.50 గంటల నుంచి మూసివేసి బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు తెరుస్తారు. నేడు జరిగే నిత్య, శాశ్వత కళ్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవంతో పాటు.. బుధవారం జరిగే శత ఘటాభిషేకం, సహస్రనామార్చన, సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. రేపు ఉదయం 10.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భద్రాచలం రామాలయం ఈరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మూసివేస్తారు. వరంగల్ భద్రకాళి ఆలయం, హనుమకొండ వేయి స్తంభాల గుడిని మూసివేయనున్నారు.
ఇక సూర్యగ్రహణం నేపథ్యంలో బాసర సరస్వతీ దేవి ఆలయాన్ని కూడా నేడు మూసివేయనున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ద్వార బంధనం, ప్రధాన ఆలయంతోపాటు ఉప ఆలయాల్లో ఆర్జిత సేవలు రద్దు చేశారు. సంప్రోక్షణ తరువాత ఆలయాలు తెరుచుకోనున్నట్లు అధికారులు తెలిపారు. రేపటి నుంచి యధావిధిగా ఆర్జిత సేవలు కొనసాగనున్నాయి.
