ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరం సీటు హాట్ టాఫిక్ గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అధికార వైసిపిని వీడి ప్రతిపక్ష టిడిపిలో చేరడంతో మైలవరం రాజకీయాలు హాట్ టాఫిక్ గా మారాయి. మైలవరంలో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపి గెలిపించుకునేందుకు వైసిపి ప్రయత్నిస్తోంది... పార్టీలోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతను చేర్చుకుని కొత్త ప్రయోగం చేస్తోంది టిడిపి. ఇలా మైలవరం రాజకీయాలు రసవత్తరంగా మారడంతో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
మైలవరం రాజకీయాలు :
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మైలవరం రాజకీయాలు సినిమా ట్విస్టులను తలపించాయి. కొద్దిరోజుల క్రితమే మాజీ మంత్రి దేవినేని ఉమ, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. కానీ రాజకీయ పరిణామాలు వేగంగా మారి వసంత, ఉమ ఒకే గూటికి చేరారు. సీనియర్ నేత దేవినేని ఉమ తీవ్రంగా వ్యతిరేకించినా టిడిపి అదిష్టానం మాత్రం వసంతను పార్టీలో చేర్చుకుంది. చంద్రబాబు చేతులమీదుగా పసుపు కండువా కప్పుకున్న వసంత కృష్ణప్రసాద్ ఈసారి టిడిపి అభ్యర్థిగా మైలవరం బరిలో దిగడం ఖాయమయ్యింది. ఈ సీటును ఆశించిన దేవినేని ఉమను మరో నియోజకవర్గానికి పంపనున్నట్లు తెలుస్తోంది. ఇలా గతంలో ఓడించిన పార్టీ నుండే ఈసారి వసంత పోటీ చేస్తున్నారన్నమాట.
మైలవరం నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. ఇబ్రహీంపట్నం
2. జి. కొండూరు
3. రెడ్డిగూడెం
4. విజయవాడ రూరల్
5. మైలవరం
మైలవరం అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,80,536
పురుషులు - 1,38,200
మహిళలు - 1,42,313
మైలవరం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతకు కాకుండా సర్నాల తిరుపతిరావు యాదవ్ ను మైలవరం బరిలో నిలిపింది వైసిపి. దీంతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసిపిని వీడి టిడిపిలో చేరారు.
టిడిపి అభ్యర్థి :
మొదట మైలవవరం టికెట్ ను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆశించారు. కానీ సడెన్ గా వసంత కృష్ణప్రసాద్ టిడిపిలో చేరడంలో ఆయనకే మైలవరం టికెట్ దక్కేలా వుంది. మైలవరం టికెట్ పై హామీ లభించాకే వసంత టిడిపిలో చేరినట్లు సమాచారం.
మైలవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;
మైలవరం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓటర్లు - 2,80,500
వైసిపి - వసంత వెంకట కృష్ణప్రసాద్ - 1,14,940(49 శాతం) - 12,749 ఓట్లతేడాతో విజయం
టిడిపి - దేవినేని ఉమామహేశ్వరరావు - 1,02,287 (43 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - అక్కల రామ్మోహన్ - 8,716 (3 శాతం) - ఓటమి
మైలవరం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 2,01,155 (85 శాతం)
టిడిపి - దేవినేని ఉమామహేశ్వరరావు - 94,539 (47 శాతం) - 7,569 ఓట్ల తేడాతో విజయం
వైసిపి - జోగి రమేష్ - 86,970 (43 శాతం) - ఓటమి
