అమలాపురంలో పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఓ వృద్ధురాలి వద్ద పని మనిషిగా చేరిన ఓ మాయ‘లేడీ’.. 24 గంటలు కాకముందే తన చేతివాటాన్ని చూపింది. ఆ వృద్ధురాలికి చెందిన రూ.ఎనిమిది లక్షల విలువైన 24 కాసుల బంగారు నగలు, రూ.20 వేల నగదు చోరీ చేసి ఉడాయించింది. 

పట్టణంలోని కల్వకొలనువీధికి చెందిన పటచోళ్ల అనంతలక్ష్మి అనే 80 ఏళ్ల వృద్ధురాలు పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యింది. ఆమెకు భర్త, పిల్లలు లేకపోవడంతో బంధువులు తనను చూసుకోవడానికి మెయిడ్ ని కుదిర్చారు.  విజయవాడకు చెందిన పనిమనుషులను కుదిర్చే ఓ కన్సల్టెన్సీ సంస్థను సంప్రదించగా వారు విజయవాడ నుంచి మేరీ సునీత అనే మహిళనుఅనంతలక్ష్మి ఇంటికి పంపించింది. 

ఆదివారం పనిలో చేరిన ఆమెకు వృద్ధురాలిని ఎలా చూసుకోవాలో చెప్పి బంధువులు చెప్పి వెళ్లిపోయారు. ఆ ఇంట్లో తామిద్దరే ఉంటారని అర్థమైన అనంతలక్ష్మి ప్లాన్ వేసింది. 
ఆదివారం అర్ధరాత్రి దాటక వృద్ధురాలి ఒంటిపైన, బీరువాలో ఉన్న 24 కాసుల బంగారు నగలను పట్టుకుని పరారైంది. 

సోమవారం ఉదయం ఇంటికి వచ్చిన బంధువులకు, పని మనిషితో పాటు ఇంట్లో నగలు మాయకావడంతో అది ఆ మహిళ చేసిన పనేనని బంధువులు నిర్ధారణకు వచ్చారు. పనికి కుదిర్చిన కన్సల్టెన్సీ సంస్థను సంప్రదించినా ఆమె గురించి సరైన సమాచారం రాలేదు. దీంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

డీఎస్పీ పడాల మురళీకృష్ణారెడ్డి, పట్టణ సీఐ ఎస్‌కే బాజీలాల్‌ లు వృద్ధురాలిని విచారించారు. పనిమనిషిగా వచ్చిన మహిళ ఆచూకీ కోసం రెండు పోలీసు బృందాలను నియమించారు. హైదరాబాద్, విజయవాడలకు సోమవారం ఉదయమే ఆ రెండు పోలీసు బృందాలు బయల్దేరాయి. 


కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ  తెలిపారు. విజయవాడకు చెందిన కన్సల్టెన్సీ సంస్థను కూడా విచారించనున్నారు. 24 కాసుల బంగారు నగలతో పాటు, రూ.20 వేల నగదు కూడా ఆ మహిళ దోచుకుపోయిందని వృద్ధురాలి బంధువులు అంటున్నారు.