విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని మధురవాడలో గల ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో భీతావహ వాతావరణం నెలకొంది. మంటల్లో సజీవ దహనమయ్యారని అనుమానించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎన్నారై కుటుంబం ఆదిత్య ఫార్చూన్ లో మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. 

అపార్టుమెంటులోని ఫ్లాట్ లో రక్తం పారిన గుర్తులు కనిపించాయి. గోడలపై రక్తం మరకలు ఉన్నాయి. మృతదేహాలపై బలమైన గాయాలున్నాయి. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతదేహాలపై బియ్యం పోసిన గుర్తులు కనిపించాయి. పోలీసు కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల బంధువులు కూడా వచ్చారు. పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. 

అగ్ని ప్రమాదం జరిగితే రక్తం మరకలు ఎలా వచ్చాయనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు తలలపై బలమైన గాయాలు కనిపిస్తున్నాయి. బంగారు నాయుడి ఒంటిపై దుస్తులు కూడా లేవు. ఫ్లాట్ లోకి పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. ఇరుగుపొరుగువారిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కుటుంబానికి శత్రువులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

విశాఖపట్నం మధురవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మధురవాడలోని ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో ఆ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. 

అయితే ఘటనా స్థలంలో రక్తం మరకలు కనపించాయి. దీంతో మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. 

ఆ సంఘటన గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగింది. ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో దాదాపు వంద ఫ్లాట్స్ ఉంటాయి. మృతులను బంగారు నాయుడు, నిర్మల, దీపక్, కశ్యప్ లుగా గుర్తించారు. బంగారునాయుడు ఆ ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నట్లు తెలుసతోంది. 

మృత్యువాత వడిన ఎన్నారై కుటుంబం 8 నెలల క్రితం అపార్టుమెంటులోకి వచ్చారు. ఆ కుటుంబం విజయనగరం జిల్లా గంట్యాడ నుంచి వచ్చి ఈ అపార్టుమెంటులో ఉంటుంది.