సినీ హీరో శివాజీ మాదిరిగా ఆపరేషన్ గరుడ అంటూ తన స్థాయిని మరింత దిగజార్చుకోవద్దని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ సలహా ఇచ్చారు.

విశాఖపట్టణం: సినీ హీరో శివాజీ మాదిరిగా ఆపరేషన్ గరుడ అంటూ తన స్థాయిని మరింత దిగజార్చుకోవద్దని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ సలహా ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనకు ముందు ఒక్కసారి కూడా పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఆ ప్రాజెక్టును గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. 

వైఎస్సార్‌ హయాంలోనే ప్రాజెక్టు ముందుకు కదిలిందని ఆయన శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. పోలవరం జాప్యానికి టీడీపి వ్యవహార ధోరణియే కారణమని తప్పు పట్టారు. నవ నిర్మాణ దీక్షను ప్రభుత్వ ఖర్చుతో చేస్తూ పార్టీ ప్రచారం కార్యక్రమంగా మార్చుకున్నారని అన్నారు. 

విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతంతో ఏపీకి ఏం కావాలో అడగని టీడీపీ నాయకులు ఇప్పుడు దీక్షలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. నిరుద్యోగులకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది ఎన్నికల భృతి అని అన్నారు.

చమురు సంబంధ ఉత్పత్తులు పెట్రోల్‌, డీజిల్‌ మొదలైనవాటిని వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కిందకు తేవాలని తమ పార్టీ ఎపి శాఖ అధిష్టానాన్ని కోరినట్లు తెలిపారు.