ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. దంపతులు రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో అక్కడి వెళ్లి విచక్షణ రహితంగా దాడి చేశారు. ఏలూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. 

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఏలూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. దెందలూరు మండలం చల్లచింతలపూడి గ్రామానికి చెందిన సాంబశివరావు, పావని మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత రాత్రి నాగులపల్లి శివార్లలో ఈ జంటపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. పావని తండ్రి, తమ్ముడు సాంబశివరావు చెవి కొరికి కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో సాంబశివరావు తీవ్రంగా గాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ‌లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై సాంబశివరావు, పావని దంపతులు.. ద్వారకా తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకారం తెలుపలేదని సాంబశివరావు చెప్పారు. గత రాత్రి ఫ్యామిలీ రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో సుధాకర్, ఫణి కుమార్‌లు తమపై దాడి చేశారని చెప్పారు. విపరీతంగా కొట్టారని.. చెవికి గాయమైందని తెలిపారు. ఇప్పటికైనా తమకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరారు. 

పావని మాట్లాడుతూ.. పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదని తెలిపారు. పెద్దలు అంగీకరించకపోయినప్పటికీ.. తాము ప్రేమ వివాహం చేసుకున్నామని చెప్పారు. తమది సేమ్ కమ్యూనిటీ అని తెలిపారు. తాము ప్రస్తుతం అత్తగారి ఫ్యామిలీ వద్ద ఉంటున్నట్టుగా చెప్పారు. నిన్న రాత్రి రెస్టారెంట్‌కు వెళ్లిన సమయతో తన తండ్రి, తమ్ముడు అక్కడికి వచ్చి విచక్షణ రహితంగా దాడి చేశారని తెలిపారు. చంపేస్తామని బెదిరించినట్టుగా చెప్పారు. తమకు రక్షణ కావాలని కోరుతున్నట్టుగా తెలిపారు.