చోడవరం: ప్రేమించి పెళ్లి చేసుకొన్న నవ  దంపతులకు గ్రామస్తులు తీసుకొన్న నిర్ణయం షాకిచ్చింది.ప్రేమించి పెళ్లి చేసుకొన్నందుకు నవ దంపతులను గ్రామస్తులు గ్రామం నుండి  బహిష్కరించారు.

విశాఖ జిల్లా చోడవరం మండలం దుడ్డుపాలెం గ్రామానికి చెందిన గణేష్ వరప్రసాద్, విస్సారపు రూప ఇరుగు పొరుగు ఇళ్లలో నివాసం ఉండేవారు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకొంటున్నారు. వారం రోజుల క్రితం వీరిద్దరూ గ్రామం వదిలి పారిపోయారు.

అంతేకాదు ఈ ప్రేమ జంట అన్నవరం  సత్యనారాయణస్వామి ఆలయంలో పెళ్లి చేసుకొన్నారు. వీరిద్దరూ కూడ శుక్రవారం నాడు గ్రామానికి వచ్చారు.అయితే వరప్రసాద్, రూప గ్రామానికి రాగానే  గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు.

గ్రామస్తులు ఏకమై నవదంపతులతో పాటు ఆ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేశారు. అయితే గ్రామ మాజీ సర్పంచ్ సత్యనారాయణతో పాటు కొందరు గ్రామస్థులు మాత్రం తాము నవ దంపతులను మాత్రం బహిష్కరించలేదన్నారు. 

వరప్రసాద్ కుటుంబం ఈ గ్రామానికి వలస వచ్చిందన్నారు. అయితే కొన్ని కారణాలతో గ్రామం నుండి వలస వెళ్లినట్టు చెప్పారు.నవదంపతులను కానీ, వరప్రసాద్ కుటుంబసభ్యులను కూడ బహిష్కరించలేదన్నారు.