పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఏలూరు చిట్టివలసపాకకు చెందిన గుడ్ల దుర్గారావు అదే ప్రాంతానికి చెందిన గంగభవాని గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు.

గంగాభవాని నగరంలోని ఓ దుకాణంలో పనిచేస్తుండగా.. దుర్గారావు జూట్ మిల్లులో పనిచేస్తున్నాడు.. వీరి ప్రేమ ముదిరి పాకాన పడటంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అయితే విషయం పెద్దలకు తెలియడంతో వీరి వివాహానికి అంగీకరించలేదు.

దీనిపై ఇరు కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ప్రేమించిన వ్యక్తిని  మరచిపోవాలని గంగాభవానిని ఆమె తల్లి గట్టిగా మందలించింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది.

తన ప్రియురాలు ఇక లేదన్న వార్త తెలుసుకున్న దుర్గారావు తన ఇంటికి సమీపంలోని రైలు పట్టాల వద్దకు చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరి మరణంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.