ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి ఉండాలని ఊసులు చెప్పుకున్నారు. ఎవరు ఎదురొచ్చినా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు అనుకున్న నిర్ణయం ప్రకారం... పెద్దలను ఎదురించి ఓ ఇంటివారయ్యారు. అయితే... కొత్త జీవితంలో అడుగుపెట్టామన్న ఆనందం వెంటనే వారంతట వారే ఆవిరి  చేసుకున్నారు.

తమ పెళ్లి విషయం పెద్దలకు తెలిస్తే ఒప్పుకోరని వారు భావించారు. కలిసి బతకనివ్వరని భ్రమించి.. కలిసి చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం... పురుగుల మందు తాగి ఇద్దరూ పెళ్లి చేసుకున్న రెండు రోజులకే ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో నవ వధువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... వరుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ  సంఘటన జమ్మలమడుగు లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కడప పట్టణానికి చెందిన బోగా శ్రీను(24), మేడిశెట్టి భార్గవి(21) కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. మండీబజారుకు చెందిన భార్గవి డిగ్రీ పూర్తి చేసింది. చిన్న బౌకు పరిధిలోని బుడ్డాయపల్లిలో ఉంటున్న శ్రీను ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.  తమ పెద్దలు ఈ వివాహానికి అంగీకరిస్తారా లేదా అనే అనుమానం వారిలో కలిగింది.

రెండు రోజుల క్రితం ఇంట్లో చెప్పకుండా వెళ్లి వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఫోటోలను కుటుంబసభ్యులకు పంపించారు.వారు ఇంటికి రండి మాట్లాడుకుందాం అనే సరికి వారిలో భయం మొదలైంది. ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో అని భయపడి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్గవి అక్కడికక్కడే మృతి  చెందగా.... శ్రీను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. గమనించిన స్థానికులు అతనిని ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.