చిత్తూరు జిల్లా గంగవరం మండల పరిధిలోని మార్జేపల్లి గ్రామంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. గ్రామానికి చెందిన యువతిని ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఇలా చేయడం మంచిదికాదని సదరు యువకున్ని సర్దిచెప్పడానికి ప్రయత్నించగా వినిపించుకోకపోగా స్నేహితులతో కలిసి తిరిగి వారిపైనే దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యువతి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మార్జేపల్లి గ్రామానికి చెందిన చరణ్ రాజ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థినిని గతకొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. నిత్యం ఆమె వెంటపడుతూ ఇబ్బంది  పెడుతున్నాడు. దీంతో ఈ వేధింపులు తట్టుకోలేకపోయిన యువతి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. 

దీంతో శుక్రవారం ఉదయం కాలేజికి వెళుతున్న యువతిని చరణ్ వెంట పడగా ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, మావయ్య కలిసి పట్టుకున్నారు. తమ కుమార్తెను వేధించడం మానుకోవాలని సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. అతడు వారి మాటలు వినిపించుకోకపోగా తన స్పేహితులతో కలిసి తిరిగి వారిపైనే కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ దాడిని గమనించిన కొందరు గ్రామస్తులు వారిని కాపాడి చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కాస్త కోలుకున్నాక యువతి  తల్లిదండ్రులు తమపై జరిగిన  దాడి, తమ  కూతురిపై వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని పరారీలో వున్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.