అనంతపురం: అనంతపురం జిల్లాలో పెళ్లైన వ్యక్తిని ప్రేమించిన  ఓ మహిళ తనను కాదన్నాడనే నెపంతో ప్రియుడి భార్యపై  కత్తితో దాడికి దిగింది. తీవ్ర గాయాలతో ప్రియుడి భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై బాధితుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

అనంతపురం జిల్లా ఎర్రనాళ్లకొట్టాలలో దారుణం చోటు చేసుకొంది. శ్రీనివాస్ అనే వ్యక్తి  మహేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ఈ దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం మహేశ్వరి గర్భవతి. 

అయితే అదే గ్రామానికి చెందిన రేష్మా అనే మహిళ శ్రీనివాస్ ను ప్రేమిస్తున్నట్టు ఫోన్ చేసి వేధించేది. అయితే శ్రీనివాస్ మాత్రం తనకు వివాహమైందని చెప్పాడు. శ్రీనివాస్ భార్య మహేశ్వరీ కూడ రేష్మాను ఫోన్‌లో తిట్టింది.

అయితే శ్రీనివాస్ కు ఫోన్ చేసి రేష్మా వేధింపులకు గురి చేసేది. ఆదివారం నాడు ఉదయం  శ్రీనివాస్ ఇంట్లో లేని సమయంలో  రేష్మా శ్రీనివాస్ ఇంటికి వచ్చింది. శ్రీనివాస్ భార్య మహేశ్వరిపై గొడవ పెట్టుకొని ఆమె గొంతుపై కత్తితో దాడికి దిగింది. 

మహేశ్వరి గట్టిగా అరిచింది. దీంతో స్థానికులు వచ్చి మహేశ్వరిని కాపాడారు. ఈ సమయంలో రేష్మా పారిపోయింది. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో మహేశ్వరిని చేర్పించారు.

అనంతపురం ప్రభుత్వ వైద్యులు మహేశ్వరి గొంతుకు 36 కుట్టు వేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిమితంగా ఉందని వైద్యులు ప్రకటించారు.  రేష్మాపై శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ ను వదిలివేయాలని  రేష్మాను కోరినా కూడ ఆమె పెట్టించుకోలేదని బాధితురాలు చెబుతున్నారు.