ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముద్దులొలికే చిన్నారి కూడా ఉంది. ఆ చిన్నారికి ఇప్పుడు రెండు సంవత్సరాలు. కాగా...   ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, కడుపున పుట్టిన బిడ్డను సరిగా చూసుకోలేపోతున్నాననే బాధ అతనిలో ఉంది. భార్య బిడ్డల కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతున్నానని రోజూ కుమిలిపోయేవాడు.చివరకు కన్న బిడ్డ ఊయలను ఉరితాడుగా చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన విజయనగరం  జిల్లా సాలూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... సాలూరు పట్టణం దాసరి వీధికి చెందిన కొట్నాన లక్ష్మణరావు(30) లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. కాగా... కొద్దికాలంగా లారీలకు సరిగా కిరాయిలు లభించక పని లభించడంలేదు. దీంతో... ఆర్థికంగా తీవ్ర సమస్యలు తలెత్తాయి.

కనీసం కన్నబిడ్డకు పాలు కూడా దొరకని పరిస్థితి. పూట గడవడం కూడా కష్టంగా మారింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. భార్య ఇంట్లో లేని సమయం చూసుకొని బిడ్డ ఉయ్యాలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన పుట్టిన రోజు నాడే అతను ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన  భార్య... భర్త విగతజీవిలా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయింది. కన్నీరు మున్నీరుగా విలపించింది. కాగా... ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.