కుప్పంలో వైసీపీ ఎంపీ రెడప్ప, ఎమ్మెల్సీ భరత్‌లకు నిరసన సెగ..
కుప్పంలో వైసీపీ ప్రజాప్రతినిధులకు నిరసన సెగ తగలింది. వైసీపీ ఎంపీ రెడప్ప, ఎమ్మెల్సీ భరత్‌లను స్థానికులు నిలదీశారు.

కుప్పంలో వైసీపీ ప్రజాప్రతినిధులకు నిరసన సెగ తగలింది. వైసీపీ ఎంపీ రెడప్ప, ఎమ్మెల్సీ భరత్‌లను స్థానికులు నిలదీశారు. వివరాలు.. వారానికి మూడు రోజులపాటు తిరిగే చెన్నై-శిరిడిల మధ్య తిరిగే సాయి నగర్ ఎక్స్ ప్రెస్ రైలుకు కుప్పంలో ఎంపీ రెడ్డెప్ప , ఎమ్మెల్సీ భరత్‌లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్‌లను కుప్పం స్థానికులు నిలదీశారు. వార్డుల్లో సమస్యలు పరిష్కరించలేదని 13వ వార్డుకు చెందిన మహిళలు నిలదీశారు. ఎన్నికల కోసం హామీలిచ్చి అమలు చేయడం మరిచారని వాపోయారు. ఉత్తుత్తి హామీలు ఇచ్చి అమలు చేయకుండా పోతున్నారని అన్నారు.
అయితే ఎమ్మెల్సీ భరత్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే మహిళలు మాత్రం తమ సమస్యలను ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వారికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్‌లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇక, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై ఏపీ సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈసారి ఎలాగైనా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న భరత్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో పాటు.. రానున్న ఎన్నికల్లో ఆయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని కూడా చేస్తానని చెప్పారు. అదే సమయంలో కుప్పం నియోజకవర్గానికి కూడా భారీగా నిధులు కేటాయించారు. సీఎం జగన్ ఆదేశాలతోనే కుప్పంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి తరుచూ కుప్పంలో పర్యటిస్తూ రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.