భక్తి పేరిట మహిళలకు దగ్గరై.. దేవుని కథలు వినిపిస్తానంటూ నమ్మించి.. ఆ పై వారికి వలపు విసురుతాడు. వారు తన దారిలోకి వస్తున్నారని అనిపించగానే.. ఎవరూ లేని ప్రదేశానికి తీసుకువెళ్లి.. అత్యాచారానికి పాల్పడతాడు. అనంతరం సదరు మహిళను చంపేస్తాడు. ఇలా ఇప్పటి వరకు ఐదుగురు మహిళలను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ దుర్మార్గుడి దారుణాలు తెలుగు రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కపిలేశ్వరపురం మండలం కేదారిలంకకు చెందిన సలాది లక్ష్మీనారాయణ  గ్రామాల్లో వెంకన్నబాబు, కనకదుర్గమ్మ కథలు చెబుతూ మహిళలను లోబరచుకునేవాడు. మాయమాటలు చెప్పి, జనసంచారం లేని ప్రాంతాలకు తీసుకు వెళ్లేవాడు. వారిపై లైంగిక దాడికి పాల్పడేవాడు. తర్వాత వారిని అతి క్రూరంగా హతమార్చి, వారి ఒంటిపై ఉన్న బంగారం దోచుకునేవాడు.

అంతటితో కథ ముగిసిపోలేదు. మహిళల శవాలు కనిపించకుండా ఇసుక తిన్నెల్లో పూడ్చి పెట్టేవాడు. గతంలో ఈ నిందితుడిని పోలీసులు రిమాండుకు తరలిస్తుండగా వారి కళ్లు గప్పి తప్పించుకుని మళ్లీ చిక్కాడు. ఐదు నేరాలకు గాను నగరం స్టేషన్‌లో నమోదైన భాగ్యవతి హత్య కేసులో లక్ష్మీనారాయణకు గురువారం జీవిత ఖైదు పడింది. అమలాపురం రెండో అదనపు జిల్లా జడ్జి సీఎస్‌ మూర్తి ఈ మేరకు తీర్పు చెప్పారు. ఇన్నాళ్లకు తమకు తగిన న్యాయం జరిగిందని బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి.