విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో హృదయ విదారకమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటనలో మరణించినవారి మృతదేహాలను అధికారులు బంధువులకు అప్పగిస్తున్నారు. ఐదు మృతదేహాలను స్వస్థలాలకు తరలించారు.

చిన్నారి గ్రీష్మ మృతదేహాన్ని చూసి బంధువులు హృదయవిదారకంగా రోదిస్తున్నారు. చిన్నారి గ్రీష్మ తల్లిదండ్రులు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. గ్రీష్మను కడసారి చూసేందుకు తల్లిదండ్రులు మార్చురీకి వచ్చారు. గ్రీష్మ మృతదేహాన్ని బంధువులు స్వగ్రామానికి తీసుకుని వెళ్లారు.  ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది మరణించిన విషయం తెలిసిందే.

Also Read: విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన: ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ

ఇదిలావుంటే, ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్త వాతావరణ చోటు చేసుకుంది. పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ సందర్శించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ను, మంత్రి అవంతి శ్రీనివాస్ ను అడ్డుకోవడానికి నిరసనకారులు ప్రయత్నించారు. అయితే, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎల్జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ విడుదల ఆగిపోవడంతో పెందుర్తి, గోపాలపట్టణం రైల్వే స్టేషన్లను తెరిచారు. 

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన ప్రధానిని కోరారు. గ్యాస్ లీక్ ఘటనపై దర్యాప్తు జరిగితేనే భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం తెలుస్తుంనది ఆయన అభిప్రాయపడ్డారు. 

Also Read: ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన: వైఎస్ జగన్ ప్రకటనపై చంద్రబాబు అసంతృప్తి

కాగా, ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం తీవ్ర విషాదాన్ని కలిగించిందని ఆయన అన్నారు. దుర్ఘటనపై మీ సత్వర స్పందనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఆయన ప్రధానికి రాసిన లేఖలో అన్నారు. వెంటనే ప్రధాని స్పందించి చేపట్టిన చర్యలు విశ్వాసాన్ని కలిగించాయని ఆయన అన్నారు. గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణకు సైంటిఫిక్ కమిటీని వేయాలని ఆయన కోరారు.