హైదరాబాద్: విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన ప్రధానిని కోరారు. గ్యాస్ లీక్ ఘటనపై దర్యాప్తు జరిగితేనే భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం తెలుస్తుంనది ఆయన అభిప్రాయపడ్డారు. 

ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం తీవ్ర విషాదాన్ని కలిగించిందని ఆయన అన్నారు. దుర్ఘటనపై మీ సత్వర స్పందనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఆయన ప్రధానికి రాసిన లేఖలో అన్నారు. వెంటనే ప్రధాని స్పందించి చేపట్టిన చర్యలు విశ్వాసాన్ని కలిగించాయని ఆయన అన్నారు. గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణకు సైంటిఫిక్ కమిటీని వేయాలని ఆయన కోరారు. 

Also Read: ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన: వైఎస్ జగన్ ప్రకటనపై చంద్రబాబు అసంతృప్తి

విషవాయువు విడుదలకు దారి తీసిన అంశాలపై దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. విడుదలైన గ్యాస్ స్టైరిన్ అని కంపెనీ చెబుతోందని, స్టైరిన్ తో పాటు మరికొన్ని వాయువులు ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయని ఆయన అన్నారు. అంతర్జాతీయ నిపుణులతో ఘటనపై విచారణ జరిపించాలని ఆయన విజ్ఢప్తి చేశారు. 

తక్షణ, దీర్ఘకాలిక వైద్య చర్యలు చేపట్టాలని, దాని వల్ల బాధితులకు సరైనా పరిహారం అందించేందుకు ఆ అంచనాలు ఉపయోగపడుతాయని చంద్రబాబు అన్నారు. విశాఖ పరిసరాల్లో గాలి నాణ్యతను పరిశీలించాలని, విషవాయువులు బాధితులకు శాశ్వత నష్టం కలిగిస్తాయని ఆయన అన్నారు. 

Also Read: విశాఖ గ్యాస్ లీకేజీ : ప్రజల ప్రాణాలు కాపాడిన పబ్ జీ గేమ్!

దీర్ఘకాలికంగా చూపే దుష్ర్పభావాలపై నిశిత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వాటిన్నింటిపై దృష్టి సారించి సరైన చర్యలు చేపట్టాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.