విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ రసాయన పరిశ్రమలో మరోసారి గ్యాస్ లీక్ అయ్యిందంటూ వచ్చిన వార్తలను కంపెనీ యాజమాన్యం తోసిపుచ్చింది. అటువంటి సంఘటన ఏమీ జరగలేదని ఆ సంస్థ శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.

పరిస్ధితి ఇప్పుడు పూర్తిగా అదుపులోనే ఉందని.. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అంతకుముందు విశాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఘటనాస్థలిని సందర్శించారు.

Also Read:విశాఖ గ్యాస్ లీకేజీ : ప్రజల ప్రాణాలు కాపాడిన పబ్ జీ గేమ్!

ఎల్జీ పాలిమర్స్ సమీపంలోని గ్రామాల ప్రజలు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గాలిలో చాలా తక్కువ మోతాదులో మాత్రమే స్టైరెన్ ఉండటాన్ని గుర్తించామని తెలిపారు.

ఆర్. వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో రెండు రోజులుగా ఆరు చోట్ల గాలిలో ఎప్పటికప్పుడు వాయువుల శాతాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం తక్కువ మోతాదులో స్టెరైన్‌ను గాలిలో గుర్తించామని ఆయన తెలిపారు.

Also Read:విశాఖలో గ్యాస్ లీక్: బాధితులకు ఎక్స్‌గ్రేషియా, రూ.30 కోట్లు విడుదల చేసిన సర్కార్

నిపుణులు, కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్లతో కలిసి పరిస్థితిని నియంత్రించడానికి చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోగా... వందల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.