విశాఖపట్టణం:  ఎల్జీ కంపెనీ ప్రతినిధులు విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో గురువారం నాడు మధ్యాహ్నం కలిశారు.

విశాఖలో ఎల్జీ కంపెనీలో గ్యాస్ లీకైన ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులను సీఎం వైఎస్ జగన్ ఇవాళ పరామర్శించారు. బాధితులను పరామర్శించి అమరావతికి బయలుదేరే ముందు ఎయిర్ పోర్టులో సీఎం జగన్ ను ఎల్జీ కంపెనీ ప్రతినిధులు కలిశారు.

also read:విశాఖలో గ్యాస్ లీకేజీని సుమోటోగా తీసుకొన్న హైకోర్టు:ప్రభుత్వాలకు నోటీసులు

గ్యాస్ లీకైన ఘటనకు సంబంధించిన  విషయమై సీఎం జగన్ కు కంపెనీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. గ్యాస్ లీక్ కావడానికి గల కారణాలను సీఎంకు వివరించారు కంపెనీ ప్రతినిధులు.

గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు తీసుకొన్న చర్యల గురించి కూడ కంపెనీ ప్రతినిధులు సీఎంకు వివరించారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కంపెనీ ప్రతినిధులకు జగన్ సూచించారు.

ఇవాళ తెల్లవారుజామున ఈ ఫ్యాక్టరీ నుండి స్టెర్లిన్ అనే గ్యాస్ లీక్ కావడంతో 10 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం కేజీహెచ్ తో పాటు ఇతర ఆసుపత్రులకు తరలించారు. 

లాక్ డౌన్ కారణంగా సుమారు 40 రోజులుగా ఫ్యాక్టరీ మూసివేసి ఉంది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నుండి మినహాయింపులు ఇవ్వడంతో ఫ్యాక్టరీని తిరిగి తెరిచేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది.