విశాఖపట్టణం:విశాఖపట్టణంలో ఎల్జీ పాలీమర్స్ ప్రమాదాన్ని ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకొంది. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గురువారం నాడు నోటీసులు జారీ చేసింది.

ఇవాళ తెల్లవారుజామున ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైన ఘటనలో పది మంది మృతి చెందారు. వందల మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
విశాఖలో ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకొన్న ఘటనను హైకోర్టు  సుమోటోగా స్వీకరించి విచారణను ప్రారంభించింది. ప్రమాద ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

also read:విశాఖలో గ్యాస్ లీకైన ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం: జగన్

ఈ విషయమై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు. విచారణ ప్రారంభమయ్యే సమయానికి అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది హైకోర్టు.

గురువారం నాడు ఉదయం ఒక్కసారిగా గ్యాస్ లీకేజీ కావడంతో ఆర్ఆర్ వెంకటాపురంతో పాటు మరో నాలుగు గ్రామాలపై ప్రభావం పడిందన్నారు. గ్యాస్ లీకైన సమయంలో ప్రజలు తమను రక్షించుకొనేందుకు మేఘాద్రిగడ్డకు పరుగెత్తారు.పోలీసులు, రెస్క్యూ సిబ్బంది బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించారు.