Asianet News TeluguAsianet News Telugu

అలిపిరి మెట్ల మార్గంలో చిరుత కలకలం: అప్రమత్తమైన టీటీడీ, భయాందోళనలో భక్తులు

తిరుమల శ్రీవారి  మెట్ల మార్గంలో  మరోసారి చిరుతపులి కన్పించింది.  దీంతో  తిరుమల తిరుపతి  దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. మెట్ల మార్గంలో  భక్తులను గుంపులు గుంపులుగా  పంపుతున్నారు.

leopard spotted near tiurmala-alipiri foot path lns
Author
First Published Nov 14, 2023, 11:12 AM IST


తిరుమల: తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో  చిరుత కలకలం రేపింది.   వేగంగా రోడ్డు దాటుతున్న  చిరుతను భక్తులు  చూశారు. వెంటనే  టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. 

ఇప్పటికే  ఆరు  చిరుతలను  టీటీడీ అధికారులు  బంధించారు. తాజాగా మరో చిరుత కన్పించడంతో  టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు.ఈ చిరుతను కూడ బంధించేందుకు టీటీడీ అధికారులు  ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే చిరుత పులులు మెట్ల మార్గంలో  రాకుండా  అధికారులు చర్యలు తీసుకున్నారు. మెట్ల మార్గంలో  ఆహారాన్ని వేయవద్దని సూచించారు. ఆహారం కోసం ఈ ప్రాంతానికి చిరుతపులులు వస్తున్నాయని  టీటీడీ అధికారులు  భావిస్తున్నారు. మెట్ల మార్గంలో  వన్యప్రాణులకు ఆహారం  వేసే  వారిని కఠినంగా శిక్షిస్తామని  టీటీడీ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది ఆగస్టు మాసంలో  నెల్లూరు జిల్లాకు చెందిన  మూడేళ్ల చిన్నారి లక్షితపై  చిరుత దాడి చేసింది.ఈ దాడిలో లక్షిత  మృతి చెందింది.  లక్షిత కంటే ముందే మరో బాలుడిపై  కూడ చిరుత దాడి చేసింది. అయితే ఆ సమయంలో  ఆ బాలుడి కుటుంబ సభ్యులు పెద్దగా అరవడంతో  బాలుడిని  కొద్ది దూరం తీసుకెళ్లి చిరుత వదిలి వెళ్లింది. 

దీంతో  ఆగస్టు,  సెప్టెంబర్ మాసాల్లో  చిరుతలను బంధించేందుకు  ఫారెస్ట్, టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. చిరుతల కదలికలున్న మార్గాల్లో బోన్లను ఏర్పాటు చేసి  వాటిని బంధించారు.  అయితే  చిరుతల నుండి రక్షణ కోసం అలిపిరి మెట్ల మార్గంలో  వెళ్లే భక్తులకు  కర్రలను అందించారు. 

అయితే తాజాగా మరో చిరుతపులి కన్పించడంతో  టీటీడీ అధికారులు  అలెర్టయ్యారు.  మెట్ల మార్గంలో  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.  

also read:తిరుమల అలిపిరి నడకమార్గంలో ఎలుగు సంచారం: అప్రమత్తమైన అధికారులు

మెట్ల మార్గానికి ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే  చిరుత పులులు  ఇటు వైపునకు రాకుండా నివారించవచ్చని టీటీడీ భావించింది. అయితే  ఈ ప్రాంతమంతా అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది. ఫెన్సింగ్ ఏర్పాటు విషయమై అటవీశాఖ మాత్రం అనుమతించడం లేదని సమాచారం. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై  టీటీడీ అధికారులు కేంద్రీకరించారు. ప్రతి రోజూ అలిపిరి మెట్ల మార్గంలో వందలాది మంది భక్తులు తిరుమల వెంకటేశ్వరస్వామని దర్శించుకొనేందుకు వెళ్తున్నారు.చిరుతపులులు, ఎలుగుబంట్లు కూడ తరచుగా మెట్ల మార్గంలో కన్పిస్తున్నాయి. దీంతో  భక్తులు భయాందోళనలకు గురౌతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios