చిరుతపులి కలకలం: చిత్తూరులో నలుగురిపై దాడి
చిత్తూరు జిల్లాలో ఆదివారం నాడు చిరుతపులి కలకలం రేపింది. నలుగురిపై చిరుతపులి దాడికి దిగింది. ఈ నలుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. నారాయణవనానికి సమీపంలో గల సింగిరికోన వద్ద చిరుతపులి దాడి చేసిందని బాధితులు తెలిపారు.
తిరుపతి:చిత్తూరు జిల్లాలో చిరుతపులులు కలకలం రేపాయి. ఆదివారం నాడు జిల్లాలోని నారాయణవనానికి సమీపంలోని సింగిరికోనలో నలుగురిపై చిరుతపులి దాడికి దిగింది. దీంతో అటవీశాఖాధికారులు అప్రమత్తమయ్యారు.చిత్తూరు జిల్లా నారాయణవనం సింగిరికోనలో గల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి నిన్న, ఇవాళ పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు.
ఇవాళ లక్ష్మీనరసింహాస్వామి దర్శనానికి వచ్చిన దంపతులపై చిరుతపులి దాడి చేసింది. పులి దాడి చేయడంతో ఆ దంపతులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. దీంతో పులి తప్పించుకొని వెళ్లిపోయింది. చిరుత దాడిలో మహిళ కంటికి గాయాలయ్యాయి. ఆమె భర్త వీపునకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన జరిగిన ఐదు నిమిషాలకే మరో ఇద్దరు భక్తులపై చిరుతపులి దాడికి దిగింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు, అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులను పోలీసులు తిరిగి పంపారు. ఆలయాన్ని మూసివేశారు. చిరుతపులి ఎక్కడుందోననే విషయాన్ని పారెస్ట్, పోలీసులు గాలిస్తున్నారు.చిత్తూరు జిల్లాలో ఇటీవల కాలంలో పులుల సంఖ్య పెరిగిందని అటవీశాఖాధికారులు చెబుతున్నారు.