కేంద్ర మంత్రి అమిత్ షా విశాఖ టూర్: వామపక్షాల నిరసన ర్యాలీ
విశాఖపట్టణంలో కేంద్ర హొం మంత్రి అమిత్ షా పర్యటనను నిరసిస్తూ ఇవాళ లెఫ్ట్ పార్టీలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
విశాఖపట్టణం: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనను నిరసిస్తూ ఆదివారంనాడు లెఫ్ట్ పార్టీలు నిరసన ర్యాలీ నిర్వహించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వామపక్షాలు ఇవాళ నిరసన ర్యాలీకి పిలుపునిచ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 9 ఏళ్ల పాటనలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల ప్రచారం కోసం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా ఇవాళ విశాఖపట్టణానికి వస్తున్న విషయం తెలిసిందే.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఏడాదికి పైగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు సాగుతున్నాయి. విశాఖపట్టణానికి ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలు ఇవాళ నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ డీఆర్ఎం కార్యాలయం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు వామపక్షాలు ప్రదర్శన నిర్వహించాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో పాటు సీపీఐకి చెందిన పలువురు నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ సహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ నేతలు కూడ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉన్నందున ప్రైవేటీకరించాలని కేంద్రం భావిస్తుంది. అయితే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ లాభాల్లో కి రావాలంటే ఏం చేయాలనే దానిపై కార్మిక సంఘాలు, ఉద్యోగులు కూడ పలు ప్రతిపాదనలు ముందుకు తీసుకువచ్చారు