హైదరాబాద్: ఎన్టీ రామారావు అధికారాన్ని కోల్పోవడానికి ప్రధాన కుట్రదారుడు చంద్రబాబు నాయుడు అవునా, కాదా అనేది చరిత్ర నిర్ణయిస్తుందని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి అన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని పాట చిత్రీకరణకు సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్ లో ఆయన ఆ విధంగా అన్నారు. 

లక్ష్మీస్ ఎన్టీఆర్ పాట చిత్రీకరణపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దగా దగా కుట్ర అనే పాట చిత్రీకరణలో చంద్రబాబును కుట్రదారుడుగా చూపించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పాటను కొన్నేళ్ల క్రితం రాసినట్లు రాకేష్ రెడ్డి చెప్పారు. దాన్ని ఎన్టీఆర్ బయోపిక్ లో వాడుకున్నట్లు తెలిపారు. 

బయోపిక్ నిర్మించడానికి తగిన వెసులుబాటు తమకు ఉందని చెప్పడానికి ఆర్టికల్ 19ను ఉటంకించారు. యూట్యూబ్ నుంచి, సోషల్ మీడియా నుంచి ఆ పాటను తొలగించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ పిల్ దాఖలు చేశారు. ఆ పిల్ పై విచారణ సాగింది. 

ఎవరి వ్యక్తిత్వాన్నైనా దెబ్బ తీస్తే సివిల్ ష్యూట్ వేయాలి లేదా క్రిమినల్ పరువు నష్టం దావా వేయాలని, ప్రస్తుత పిటిషన్ ను పిల్ గా విచారణకు స్వీకరించడానికి వీలు లేదని రాకేష్ రెడ్డి కోర్టులో వాదించారు. 

ఈ పిటిషన్ ను ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి వేయలేదని, ఆయన అనుచరుడు వేశాడని, తన నాయకుడిని సంతోషపెట్టడానికి ఆయన ఈ పిల్ వేశాడని రాకేష్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాక ముందే ఆ పాటను శ్రీశ్రీ రాశారని, ఎన్టీఆర్ అధికారం కోల్పోయిన సంఘటన విషయంలో చంద్రబాబు చేసే ఆరోపణల్లో కొత్త దనమేదీ లేదని ఆయన అన్నారు. 

అక్రమ మార్గంలో ఎన్టీఆర్ ను గద్దె దించారని లక్ష్మీ పార్వతి పలుమార్లు ఆరోపించారని ఆయన అన్నారు. ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా అదే వాదన చేశారని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్ ను గద్దె దించడంపై దగ్గుబాటి పుస్తకం కూడా రాశారని ఆయన అన్నారు. 

రామ్ గోపాల్ వర్మపై కూడా కొంత రాకేష్ రెడ్డి తన అఫిడవిట్ లో చెప్పారు. వర్మ పేరున్న దర్శకుడని ఆయన చెప్పారు. హిందీ, తెలుగు భాషల్లో 50కి పైగా సినిమాలు నిర్మించారని ఆయన అన్నారు. రాజకీయాలకు సంబంధించిన రక్త చరిత్ర వంటి సినిమాలు తీశారని ఆయన గుర్తు చేశారు.