హైదరాబాద్‌: వరుస వివాదాలతో విడుదలకు నోచుకోని లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదలకు సన్నద్దమవుతోంది. ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఏపీలో విడుదలకు అభ్యంతరం వ్యక్తం చేసింది తెలుగుదేశం పార్టీ. 

దీంతో ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదలకు వాయిదా పడింది. ఏపీలో అవకాశం లేకపోవడంతో తెలంగాణతోపాటు ఇతర ప్రాంతాల్లో మార్చిలో ఈ సినిమాను విడుదల చేశారు రామ్ గోపాల్ వర్మ. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో సినిమాను వాయిదా వెయ్యాలని ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయరాదని ఈసీని కోరింది తెలుగుదేశం పార్టీ. 

ఈసీ ఆదేశాలతో సినిమా విడుదలకు బ్రేక్ లు పడ్డాయి. ఎన్నికలు ముగియడంతో మే 1న చిత్రాన్ని ఏపీలో విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. దివంగత సీఎం ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 

ఎన్టీఆర్ గా రంగస్థల నటుడు విజయ్ కుమార్ పోషించగా లక్ష్మీపార్వతిగా కన్నడ నటి యజ్ఞశెట్టి నటించారు. ఈ సినిమాని రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరిలు నిర్మించారు. అయితే మే 1న అయినా సినిమా విడుదలపై అనేక సందేహాలు నెలకొన్నాయి. 

మే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మళ్లీ వాయిదా వెయ్యాలంటూ టీడీపీ కోరే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే వరుస వివాదాలతో వాయిదాలకు నోచుకోని లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈసారైనా ఏపీలో విడుదల అవుతుందో లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే విడుదల చెయ్యాలని టీడీపీ ఫిర్యాదు చేసి విడుదలను అడ్డుకుంటుందో చూడాలి.