సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ @ వ్యవసాయ శాఖ మంత్రి

Lakshmi Narayana wants to become agriculture minister
Highlights

పొలిటికల్ ఎంట్రీపై సిబిఐ మాజీ జెడి కామెంట్స్

మీరు చదివింది నిజమా కాదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారా? మీరు చదివింది నిజమే కానీ ... అసలు విషయం వేరే ఉంది. ఆ కథా కమామిషు ఏమిటో కింద చదవండి.

గుంటూరు జిల్లాలోని యాజిలిలో సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ రైతులతో సమావేశమయ్యారు. తన యాగాన్ని ఇక్కడినుంచే ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. పుణ్యభూమి యాజిలి అని కొనియాడారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై లక్ష్మినారాయణ మాట్లాడారు. తాను వ్యవసాయ శాఖ మంత్రి అయితే మీకోసం నేను ఏం చేయొచ్చో ఆలోచిస్తా అని తన మనసులో మాట బయటపెట్టారు. ఒకవేళ తాను వ్యవసాయ శాఖ మంత్రి కాలేకపోతే ఒక సోషల్ వర్కర్ గా రైతుల కోసం ఏం చేయగలనో అని ఆలోచిస్తానన్నారు. ఇంత గొప్ప ప్రాంతం యాజిలి నుంచి అన్నదాత కోసం పనిచేస్తే ఫలితం రావొచ్చని ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఏ దేశంలో అయితే అన్నదాతను విస్మరిస్తారో ఆ దేశానికి భవిష్యత్తు ఉండదు అని వివేకానంద స్వామి అన్నారని గుర్తు చేశారు. మరి మన దేశంలో రైతులు సున్నా మార్కులు కాదు 200 మార్కులు రావడం కోసం ప్రయత్నం చేస్తామన్నారు. ఎందుకు సాధించలేను అని ప్రశ్నించుకుంటేనే ఏదైనా సాధించగలం అని రైతుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. రైతులు సంఘటితంగా ఉంటే ఏదైనా సాధ్యమే అని చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చి రైతులకు సేవ చేయాలా? లేక రాజకీయాలకు దూరంగానే ఉండి వ్యక్తిగతంగా సర్వీస్ చేయాలా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మీడియా తనను చాలా పార్టీలలో చేర్చిందని, తాను అన్ని పార్టీలను ఆప్షన్‌గా ఉంచుకున్నానని మాజీ ఐపీఎస్‌ లక్ష్మీనారాయణ చెప్పారు. ఏ పార్టీతో టచ్‌లో లేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రమంతా పర్యటిస్తానని, ప్రజల సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు. అధ్యయనం పూర్తయ్యాక ఏ పార్టీలో చేరాలనేదానిపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. ప్రత్యేక హోదా వల్ల ఏపీకి మేలు జరుగుతుందని, ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

loader