Asianet News TeluguAsianet News Telugu

నిత్య పెళ్లికూతురి గుట్టు రట్టు: ముగ్గురిని పెళ్లాడిన కిలాడీ లేడీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో నిత్య పెళ్లి కూతురు బాగోతం వెలుగు చూసింది. ఓ మహిళ ముచ్చటగా ముగ్గురిని పెళ్లాడింది. పెళ్లిళ్లు చేసుకుని బ్లాక్ మెయిల్ చేయడం ఆ పనిగా పెట్టుకుంది.

Lady marries three persons in Prakasam district of Andhra Pradesh
Author
ongole, First Published Jul 27, 2020, 2:40 PM IST

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో నిత్య పెళ్లి కూతురు గట్టు రట్టయింది. మ్యాట్రిమోనీ వైబ్ సైట్లలో జీవితంలో స్థిరపడిన యువకులను చూసి, పెళ్లి చేసుకుని, కొంత కాలం కాపురం చేసి ఆ తర్వాత బెదిరించి సెటిల్ మెంట్లు చేసుకోవడం ఆమె ఓ పనిగా పెట్టుకుంది. కాదని ఎదురు తిరిగితే పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తుంది. 

కాగా, ఇటీవల ఆమె మూడో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తిరుపతికి చెందిన యువతి పతంగి స్వప్న అలియాస్ పతంగి హరిణి అలియాస్ నందమురారి స్వప్న పేర్లు మార్చుకుని మూడు పెళ్లిళ్లు చేసింది. మ్యాట్రిమోని సైట్లలో తాను ఐపిఎస్ అధికారిగా చెప్పుకుని, బయోడేటా ఇచ్చి యువకులను బోల్తా కొట్టించింది.

నిరుడు డిసెంబర్ లో ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వీరేపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. మూడు నెలల పాటు హైదరాబాదులో అతనితో కాపురం చేసింది. డెన్మార్క్ లో ఉద్యోగం చేసే రామాంజనేయులు స్వప్నను కూడా తీసుకుని వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. అయితే, ఆమె అతనితో వెళ్లేందుకు నిరాకరించింది. 

పాస్ పోర్టుకు ఇప్పుడే దరఖాస్తు చేయలేనని, కొన్ని పనులు ఉన్నాయని చెప్పింది. దాంతో రామాంజనేయులు ఒక్కడే డెన్మార్క్ వెళ్లాడు. అయితే స్వప్న తీరుపై అనుమానం వచ్చిన రామాంజనేయులు కూపీ లాగాడు. దాంతో ఆమె బాగోతాలు వెలుగు చూశాయి. అమె అంతకు ముందు ఇద్దరిని పెళ్లి చేసుకున్నట్లు అతనికి తెలిసింది. 

చిత్తూరుకు చెందిన పృథ్వీరాజ్, ఆత్మకూరుకు చెందిన సుధాకర్ అనే వ్యక్తులతో ఆమెకు గతంలో వివాహమైనట్లు రామాంజనేయులు కనిపెట్టాడు. పృథ్వీపై తిరుపతి మహిళా పోలీసు స్టేషన్ లో ఆమె కేసు పెట్టింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తిరుపతికి చెందిన ఓ మహిళ ఆమె రూ.6 లక్షలు వసూలు చేసినట్లు కూడా ఆమెపై ఆరోపణలున్నాయి. దీనిపై తిరుపతి పోలీసు స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. 

దాంతో రామాంజనేయులు స్వప్నను నిలదీశాడు పెళ్లి చేసుకున్నావు కాబట్టి తనకు రూ.30 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకోవాలని డిమాండ్ చేసింది. అతను లొంగకపోవడంతో దొనకొండ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కాగా, రామాంజనేయులు కుటుంబ సభ్యులు కూడా స్వప్నపై పోలీసులకు ఫిర్యాదు చేశారు .పోలీసుల విచారణలో స్వప్న బాగోతాలు బయటపడ్డాయి.

Follow Us:
Download App:
  • android
  • ios