శ్రీకాకుళం: లాక్ డౌన్ నేపథ్యంలో ఓ గర్భిణీ ఆసుపత్రికి వెళ్లేందుకు తీవ్రంగా శ్రమించింది. డోలి సహాయంతో ఆమెను కుటుంబసభ్యులు తరలించారు. ఎట్టకేలకు ఆమెను రోడ్డు మార్గం వద్దకు తీసుకురావడంతో 108 అంబులెన్స్ లో కొత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని అల్లీ గ్రామ పంచాయితీ పరిధిలోని దిగువరాయిగూడ గ్రామానికి చెందిన సవర వాణిశ్రీ గర్భవతి.సోమవారం నాడు ఉదయం ఆమెకు పురుటి నొప్పులు వచ్చాయి. 

ఈ సమాచారం అందుకొన్న ఎఎన్ఎం సవరమ్మ, ఆశా కార్యకర్తలు వాణిశ్రీని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.లాక్ డౌన్ నేపథ్యంలో వాహనాలు నడవడం లేదు. ఒడిశా సరిహద్దు మార్గం నుండి కొత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించాలని ప్లాన్ చేశారు.

శ్రీకాకుళం జిల్లా దిగువరాయిగూడ నుండి ఒడిశా సరిహద్దు వరకు వాణిశ్రీని ఆటోలో తీసుకొచ్చారు. అల్లీ పంచాయితీకి వెళ్లే దారిని మిలగాం వద్ద ఒడిశా అధికారులు తవ్వేశారు. దీంతో ఈ మార్గంలో వాహనాలు నడిచే పరిస్థితులు లేవు.

దీంతో వాణిశ్రీని డోలి కట్టి ఆ డోలిలో మోసుకొంటూ మిలగాం దాటించారు. అప్పటికే 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. మిలగాం దాటగానే అంబులెన్స్ వచ్చింది. ఈ అంబులెన్స్ లో గర్భిణీని కొత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొత్తూరు ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.