తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో  సూర్య గ్లోబల్ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. కాకినాడ రూరల్ గ్రామానికి చెందిన కుడిపుడి సూరిబాబు అనే వ్యక్తి సూర్య గ్లోబల్ ఆసుపత్రిలో గత రెండేళ్ల నుంచి ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు.

రోజువారీ విధుల్లో భాగంగానే మంగళవారం రాత్రి విధులకు వచ్చిన సూరిబాబు.. అర్థరాత్రి సమయంలో ఆసుపత్రి పైన వున్న ఆర్వో ప్లాంట్ వద్ద స్విచ్ ఆన్ చేసి వస్తాను అని పైకి వెళ్లాడు. కానీ ఉదయం వరకు అతను తిరిగి రాకపోవడంతో సహచర సిబ్బంది పైకి వెళ్లి చూడగా సూరిబాబు విగత జీవిగా కనిపించాడు.

సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఆర్వో ప్లాంట్ వద్ద విద్యుత్ షాక్ కారణంగానే సూరిబాబు మరణించి వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు మృతుడికి రెండేళ్ల క్రితం వివాహం కాగా.. భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. అతని మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుటుంబాన్ని హాస్పిటల్ యాజమన్యం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

 

"