అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమీక్షా సమావేశాలపై కాంగ్రెసు నేత కేవిపి రామచందర్ రావు చురకలు అంటించారు. మంచి పనులు చేస్తుంటే ఏ అధికారి అడ్డుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శనివారం చంద్రబాబుకు ఓ బహిరంగ లేఖ రాశారు. 

సొంతవారి బిల్లులు క్లియర్ చేసేందుకే చంద్రబాబు సమీక్షలు పెడుతున్నారని కేవిపి ఆరోపించారు. బిల్లులు క్లియర్ చేస్తే ఆ తర్వాత అధికారులు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. పోతిరెడ్డిపాడుపై చంద్రబాబు గతంలో ఉద్యమం చేశారని ఆయన గుర్తు చేశారు.  

చంద్రబాబు వైఖరి వల్ల పోలవరం విషయంలో ఏపీకి తీరని నష్టం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిగత స్వార్ధం, రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీతో లాలూచీపడి ప్రజలకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని ఆయన విమర్శించారు. 

విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా సాధించలేకపోయారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని పోలవరం విషయంలో ఏపీపై భారం పడటాన్ని అంగీకరించేదిలేదని అన్నారు. 

2014కు ముందు పోలవరంపై చంద్రబాబు ఒక్క సమీక్షా సమావేశమైనా నిర్వహించారా అని అడిగారు. పోలవరం ప్రాజెక్టు పనులు చాలా వరకు కాంగ్రెసు ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఆయన అన్నారు.