Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌లోకి షర్మిల .. నీడలా వైఎస్ ఆత్మ, కేవీపీ మరోసారి చక్రం తిప్పుతారా..?

ఏపీపైనా కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టి వైఎస్ తనయురాలు షర్మిలా రెడ్డిని పీసీసీ చీఫ్‌గా చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ రామచంద్రరావుకు పట్టు చిక్కింది. అనుకున్నట్లుగానే హైదరాబాద్ నుంచి షర్మిలతో కలిసి ఇడుపులపాయకు వచ్చిన కేవీపీ.. అక్కడి నుంచి విజయవాడలో షర్మిల పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించే వరకు ఆమె పక్కనే వున్నారు.

kvp ramachandra rao became active in congress party ksp
Author
First Published Jan 23, 2024, 4:58 PM IST | Last Updated Jan 23, 2024, 4:59 PM IST

కేవీపీ రామచంద్రరావు.. తెలుగు రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేవీపీ చక్రం తిప్పారు. కాంగ్రెస్ పార్టీలో వ్యూహాలతో పాటు అసంతృప్తులను కేవీపీ చక్కబెట్టారు. టికెట్లు, మంత్ర పదవులు, నామినేటెడ్ పోస్టులు, ఐఏఎస్ , ఐపీఎస్‌ల ట్రాన్స్‌ఫర్లు మొత్తం కేవీపీ కనుసన్నల్లోనే జరిగేవి. కేవీపీ చెబితే వైఎస్ చెప్పినట్లేనని అంతా భావించేవారు. అయితే వైఎస్ మరణం , రాష్ట్ర విభజన తర్వాత కేవీపీ రామచంద్రరావు సైలెంట్ అయ్యారు. కానీ రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్ అనుచరులే అన్ని పార్టీల్లో వుండటంతో కేవీపీ ప్రభ మసకబారలేదు. అలాగే హైకమాండ్ వద్ద ఆయన మాట కూడా చెల్లుబాటు అవుతోంది. 

వైఎస్ తనయుుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో కేవీపీ రామచంద్రరావు చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ.. ఆయన ఆ వైపు కన్నెత్తి చూడలేదు. తన పని తాను చూసుకునేవారు తప్పించి, కనీసం జగన్‌కు సూచనలు కూడా చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత కేవీపీ ఎక్కువగా హైదరాబాద్, ఢిల్లీకే పరిమితమైపోయారు. దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కేవీపీ తిరిగి యాక్టీవ్ అవుతోంది. ఏపీపైనా కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టి వైఎస్ తనయురాలు షర్మిలా రెడ్డిని పీసీసీ చీఫ్‌గా చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ రామచంద్రరావుకు పట్టు చిక్కింది. 

అనుకున్నట్లుగానే హైదరాబాద్ నుంచి షర్మిలతో కలిసి ఇడుపులపాయకు వచ్చిన కేవీపీ.. అక్కడి నుంచి విజయవాడలో షర్మిల పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించే వరకు ఆమె పక్కనే వున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. షర్మిల తనకు మేనకోడలని చెప్పారు. ఇదే సమయంలో గతంలో వైఎస్ కోటరీలో వున్న నేతలను తిరిగి కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చేందుకు కేవీపీ పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలలో టికెట్లు దక్కని వారిని కూడా షర్మిల వెంట నడిచేలా చేయాలని పెద్దాయన చూస్తున్నారట. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను తిరిగి బలోపేతం చేసి , షర్మిలకు ఎదురు లేకుండా చేయాలని కేవీపీ భావిస్తున్నారట. మొత్తానికి వైఎస్‌ ఆత్మలా పేరొందిన కేవీపీ.. ఇప్పుడు షర్మిల నీడలా మారుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios