హైదరాబాద్: రాష్ట్రముఖ్యమంత్రిగా వైయస్ జగన్ పాలన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత సీఎం వైయస్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. 

వైయస్ జగన్ పై రకరకాల ఆరోపణలు చేశారని వాటన్నింటిని ప్రజలు తిరస్కరించారని చెప్పుకొచ్చారు. కొన్ని మీడియా ఛానెల్స్ వైయస్ జగన్ పై దుష్ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జగన్ వైసీపీని పట్టాలెక్కిస్తాడా లేదా అని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారని వాటిని ప్రజలు పటాపంచెలు చేశారని చెప్పుకొచ్చారు. జగన్ పనికిరానివాడని, ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరవుతారంటూ కొన్ని మీడియా ఛానెల్స్ పనిగట్టుకుని వక్రభాష్యాలు చెప్పిందని, జగన్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేడని సందేహాలు కలిగేలా ప్రచారం చేశారని మండిపడ్డారు. 
జగన్ నాయకత్వంపై సందేహాలు వెలిబుచ్చుతూ, ఆ పార్టీ నేతలను గందరగోళం నెట్టే ప్రయత్నం పత్రికలు, ఛానెల్స్ చేశాయన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని రికార్డు సృష్టించారని అభిప్రాయపడ్డారు. 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షోభంలో ఉన్న మాట వాస్తవమేనని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, జగన్ ప్రవేశపెట్టిన పథకాలు ఏయే అమలుకు సాధ్యపడతాయో నిపుణులతో చర్చించి వాటిని అమలు చేయాలని సూచించారు. జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అందుకు అన్ని పరిస్థితులను సమకూర్చుకుని ముందుకు సాగాలని కేవీపీ ఆకాంక్షించారు.